నాగార్జున సాగర్ అసెంబ్లీ, తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలు త్వరలో జరగబోతున్నాయి. ఈరోజు ఈ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఈరోజు మొదలు కానున్న నామినేషన్ల ప్రక్రియ ఈ నెల 30 వరకు కొనసాగుతుంది. అలాగే ఈనెల 31 వ తేదీన నామినేషన్ల పరిశీలన, ఏప్రిల్ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ ఉండనుంది. ఇక ఏప్రిల్ 17 వ తేదీన ఎన్నికలు జరగనుండగా మే 2 వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి.
ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతుండటంతో అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడానికి సిద్ధం అయ్యాయి. తిరుపతి విషయనికి వస్తే ఇప్పటికే టీడీపీ, వైసీపీ తమ అభ్యర్థులను ప్రకటించాయి. బీజేపీ కూడా తమ అభ్యర్థిని ప్రకటించేందుకు కసరత్తులు చేస్తోంది. ఇక నాగార్జున సాగర్ విషయానికి వస్తే ఎమ్మెల్సీ స్థానాన్ని నిలబెట్టుకున్న టీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో సాగర్ ని కూడా మళ్లీ నిలబెట్టుకోవాలని కసరత్తులు చేస్తోంది. మరో పక్క జానాకు కంచుకోట అని చెప్పుకునే సాగర్‌లో ఐనా కనీసం సత్తా చాటాలని కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఎమ్మెల్సీ చేజార్చుకోవడంతో దానిని అయినా దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది.