ఏపీలో ప్రతి పక్ష టీడీపీ రాష్ట్ర డీజీపీని టార్గెట్ చేస్తోంది. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవనీ….రూల్ ఆఫ్ లా అమలు కావడం లేదని ఆరోపిస్తోంది. వైసీపీ అదికారంలోకి వచ్చినప్పట్నుంచి పోలీసు శాఖ తీరుపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాయల సీమలో, పల్నాడులో పోలీసులు చట్ట ప్రకారం వ్యవహరించడం లేదంటూ నానా యాగీ చేసింది. ప్రతి అంశంలో చంద్రబాబు నేరుగా డీజీపీ లేఖలు రాస్తున్నారు. నియోజవర్గంలో కార్యకర్త సమస్య అయినా.. రాష్ట్ర స్థాయి సమస్యయినా.. పోలీస్ బాస్‌కు లేఖాస్త్రాలు సందిస్తున్నారు. అయితే పోలీస్ బాస్ కూడా అంతే ధీటుగా స్పందిస్తున్నారు.
టీడీపీ అధినేత పదే పదే డీజీపీ కి లేఖలు రాయడం వెనుక రెండు వ్యూహాలు కనిపిస్తున్నాయి. సదరు ఘటనలపై నేరుగా డీజీపీ స్థాయిలో స్పందించేలా చేయడం ఒకటైతే… పోలీస్ బాస్ కు లేఖలు రాయడం ద్వారా కింది స్థాయి అధికారుల్లో కూడా భయం ఉంటుందనేది రెండో వ్యూహం. తద్వారా ఆయా కేసుల విషయంలో న్యాయం బద్దంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నారని సైకిల్ పార్టీ నేతలు చెబుతున్నారు.
టీడీపీ లేఖలకు అదే స్థాయిలో బదులిస్తున్నారు డీజీపీ. సాదారణంగా శాంతి భద్రతల విషయంలో ఆరోపణలు వచ్చినప్పుడు హోంమంత్రి సమాధానం చెబుతారు. అయితే ఎపిలో హోం మంత్రి కంటే ముందు డిజిపియే నేరుగా స్పందిస్తుండటం పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ ఆరోపణలకు వేదికగా ఉండే లేఖలపై సైలెంట్ గా ఉండాల్సిన అవసరం పోలీసు ఉన్నతాధికారులకు లేదని… అందుకే స్వయంగా డీజీపీ కూడా రియాక్ట్ అవుతున్నారని పోలీసు శాఖ చెబుతోంది.
చంద్రబాబు, డీజీపీకి లేఖలు రాయడంపై స్పందించిన ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి… తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అసలు చంద్రబాబు డీజీపీకి ఎందుకు లేఖలు రాస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. చంద్రబాబుకు అధికారం తప్ప మరో ఆలోచన లేదన్నారు సజ్జల. ఏదేమైనా పోలీసు శాఖపై తురుచూ డిజిపికి లేఖలు రాస్తూ చంద్రబాబు హీట్ పుట్టిస్తుండగా… అదే స్థాయిలో సమాధానం ఇస్తూ కౌంటర్‌కు తామూ సిద్దంగా ఉన్నామనే సంకేతమిస్తున్నారు పోలీసు ఉన్నతాదికారులు. పోలీస్ బాస్ ను నేరుగా టార్గెట్ చెయ్యడం ద్వారా.. టిడిపి మైండ్ గేమ్ ఆడుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.