బీజేపీ రాష్ట్ర సారథి.. ఆర్ ఎస్ ఎస్ భావజాలం పుణికి పుచ్చుకున్న సోము వీర్రాజుకు అప్పుడే పార్టీలో ఎదురు దెబ్బలు మొదలయ్యాయా ? రాష్ట్ర బీజేపీ పగ్గాలు చేపట్టి పట్టుమని నాలుగు మాసాలైనా కాకుండానే ఆయన వ్యవహారంపై కేంద్ర బీజేపీ దృష్టి పెట్టిందా ? ఈ క్రమంలో తానే ఇనిషియేట్ తీసుకుని రాష్ట్రంలో పార్టీ పరుగులు పెట్టేందుకు అనుసరించాల్సిన వ్యూహాన్ని సిద్ధం చేస్తోందా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. నిజానికి సోము వీర్రాజు వ్యూహం ఫలిస్తుందని.. పార్టీ పరుగులు పెడుతుందని అందరూ అనుకున్నారు. ఆయన వచ్చీ రాగానే పార్టీలో ఒక బూమ్ అయితే తెచ్చారు. ఈ విషయంలో సందేహం లేదు.
ఎక్కడో ఉన్న నాయకులను కూడా ముందుకు నడిపించారు. పార్టీ తరఫున గట్టి వాయిస్ వినిపించారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే, ఇక్కడే ఆయన ఏకపక్షంగా వ్యవహరించడం కేంద్రంలోనిబీజేపీకి ఫిర్యాదులు వెళ్లడంతో పరిస్థితి యూటర్న్ తీసుకుని సోము తనను తాను నియంత్రించుకునే పరిస్థితి వచ్చిందని అంటున్నారు పరిశీలకులు. ప్రతిపక్షం టీడీపీపై విమర్శలు చేయడంలో సోము దూకుడుగా వ్యవహరించారు. అదే సమయంలో దేవాయాలపై జరుగుతున్న దాడుల వెనుక చంద్రబాబు ఆయన అనుచరులుఉన్నారనేలా వ్యాఖ్యలు చేశారు. నిజానికి ఎవరైనా ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తారు. కానీ, సోము ఏమనుకున్నారోఏమో.. ప్రభుత్వాన్ని వదిలి బాబును టార్గెట్ చేశారు.
ఇది కేంద్రంలోని బీజేపీ పెద్దలకు నచ్చలేదని తెలుస్తోంది. అదే సమయంలో రాష్ట్ర బీజేపీకి కొత్త టీం ను ఏర్పాటు చేసుకున్న సోము.. కీలకమైన కమ్మ సామాజిక వర్గాన్ని పక్కన పెట్టారు. దీంతో ఆయా అంశాలపై కేంద్రంలోని బీజేపీ పెద్దలకు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ వంటి కీలక నాయకులు ఫిర్యాదులు చేశారని, ఇలా పార్టీకి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారని అంటున్నారు. ఈ పరిణామాలతో కేంద్రంలోని బీజేపీ పెద్దలు అనూహ్యంగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరికి జాతీయ బీజేపీలో మంచి స్థానం కల్పించారని అంటున్నారు.
నిజానికి ఇంత కీలక పదవి ఇప్పటి వరకు రాష్ట్రంలో ఎవరికీ దక్కలేదని, ఇది నిజంగా కమ్మ వర్గాన్ని పార్టీకి చేరువ చేయడంలో ప్రధానంగా ఉపయోగపడుతుందని అంటున్నారు. ఇక, సోమును కూడా కంట్రోల్ చేసుకోవాలని సూచించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఇటీవల కాలంలో సైలెంట్ అయ్యారని, దేవాలయాలపై ఉద్యమంలో కలుగ జేసుకున్న మంత్రి కొడాలి నానికి కౌంటర్ కూడా ఇవ్వకపోవడం వెనుక ఇదే కారణంగా కనిపిస్తోందని అంటున్నారు. మొత్తానికి పార్టీ పగ్గాలు చేపట్టిన ఆదిలోనే ఇలా దెబ్బలు తగిలితే.. మున్ముందు ఎంత జాగ్రత్తగా ఉండాలోనని సోము వర్గం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
-vuyyuru subhash