మల్లన్న రాక బీజేపీకి ప్లస్సేనా… సీటు ఫిక్స్ చేస్తారా?

-

తెలంగాణలో బీజేపీ దూకుడు మీద ఉంది….అధికార టీఆర్ఎస్‌కు గట్టి పోటీ ఇస్తూ…దూసుకెళుతుంది. ఉపఎన్నికల్లో టీఆర్ఎస్‌ని మట్టి కరిపిస్తూ…బీజేపీ రోజురోజుకూ స్ట్రాంగ్ అవుతుంది. అలాగే ఈటల రాజేందర్ లాంటి బలమైన నాయకులని బీజేపీలో చేర్చుకుంటూ….టీఆర్ఎస్‌కు ధీటుగా వెళుతుంది. ఇలా దూకుడుగా ముందుకెళుతున్న బీజేపీ…బలమైన నేతలని వరుసపెట్టి పార్టీలో చేర్చుకుంటున్నారు.

Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న
Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న

తెలంగాణ ఉద్యమకారుడు విఠల్‌ని పార్టీలో చేర్చుకున్న బీజేపీ…తాజాగా తీన్మార్ మల్లన్నని పార్టీలో చేర్చుకుంది. ఇక బీజేపీలో చేరడం చేరడమే…మల్లన్న దూకుడుగా కేసీఆర్‌పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. తెలంగాణ ప్రజలు సీఎం కేసీఆర్‌కు రాజకీయ సమాధి కట్టడం ఖాయమని, బీజేపీ తనకు సభ్యత్వ తాడును ఇచ్చిందని, దాంతో రాష్ట్రాన్ని దోచుకుంటున్న కేసీఆర్‌ కుటుంబాన్ని అమరవీరుల స్తూపానికి కట్టేస్తానన్నారు.

మామూలుగానే మల్లన్న దూకుడుగా… కేసీఆర్ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ఇండిపెండెంట్‌గా ఉంటూ వస్తున్న మల్లన్న… నిత్యం కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న తప్పులని ఎత్తిచూపుతూ వస్తున్నారు. తనకంటూ ఓ చానల్ పెట్టుకుని… ప్రభుత్వ తప్పులని ఎండగడుతున్నారు. అలాగే ఆ మధ్య గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోటీ చేసి దాదాపు టీఆర్ఎస్‌ని ఓడించినంత పనిచేశారు. ఇలా టీఆర్ఎస్‌పై పోరాటం చేస్తున్న మల్లన్నకు వ్యక్తిగతంగా మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయనకు రాష్ట్ర స్థాయిలో కొంత క్యాడర్ సపోర్ట్ ఉంది.

అలాంటి నాయకుడు బీజేపీలో చేరడం..ఆ పార్టీకి ప్లస్ అవుతుందనే చెప్పాలి. పైగా మల్లన్న నల్గొండ జిల్లాకు చెందిన నేత. అసలు బీజేపీకి.. నల్గొండలో బలమైన నాయకత్వం లేదు. మల్లన్న రాకతో నల్గొండలో బీజేపీకి కొత్త ఊపు వస్తుంది. అక్కడ టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకు ధీటుగా ఎదిగేందుకు బీజేపీకి మంచి అవకాశం దొరికినట్లే. ఇక బీజేపీలోకి వచ్చిన మల్లన్న… ఇకపై ఇంకా దూకుడుగా రాజకీయం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈయన వచ్చే ఎన్నికల్లో బీజేపీ నుంచి బరిలో దిగడం ఖాయం. అయితే మల్లన్న ఏ సీటులో బరిలో దిగుతారో క్లారిటీ లేదు. నల్గొండ జిల్లా పరిధిలోనే మల్లన్న పోటీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. చూడాలి మరి మల్లన్న వల్ల బీజేపీకి ఇంకెంత ప్లస్ అవుతుందో.

Read more RELATED
Recommended to you

Latest news