తెలంగాణ లో కొత్త మద్యం పాలసీకి రంగం సిద్దం..!

-

తెలంగాణలో కొత్త మద్యం పాలసీకి రంగం సిద్దమైనట్లు తెలుస్తోంది. కొత్త మద్యం పాలసీపై ఎక్సైజ్ అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాధారణంగా మధ్యం పాలసీ రెండు సంవత్సరాలకు ఒకసారి ముగుస్తుంది. ఈ ఏడాది అక్టోబర్ తో పాత టెండర్ల కాలపరిమితి ముగియాలి. అయితే కరోనా కారణంగా లాక్ డౌన్ పెట్టడంతో మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దీంతో పాత లైసెన్సులను నెల పాటు పొడగించారు. నవంబర్ దాకా పాత లైసెన్సుల మీదే మద్యం అమ్మకాలు కొనసాగాయి. దీంతో కొత్త పాలసీని డిసెంబర్ నుంచి అమలులోకి తేవాలి. ఇందు కోసం దీపావళి తరువాత టెండర్ ప్రక్రియను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. 

ఈనేపథ్యంలోనే కొత్త మద్యం పాలసీకి మార్గదర్శకాలు రూపొందించడంతో పాటు విధివిధానాలు ఖరారు చేయడంపై అధికారులు ద్రుష్టి సారించారు. నవంబర్ 2 న హుజూరాబాద్ ఉపఎన్నిక ఫలితాలు రాగానే కొత్త పాలసీపై నోటిఫికేషన్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. అనంతరం టెండర్ల ప్రక్రియను ప్రారంభించి వారం పాటు దరఖాస్తులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 2216 మద్యం షాపులు ఉండగా మరో 10 శాతం దుకాణాలు పెరుగనున్నట్లు తెలుస్తోంది.

గతంలో ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు మద్యం దుకాణాలతో రిజర్వేషన్లు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనిపై న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. ఖమ్మంకు చెందిన వ్యాపారులు రిజర్వేషన్ ప్రక్రియ సరిగా లేదంటూ హైకోర్ట్ లో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వ కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ చిక్కులు తొలిగాకే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అభిప్రాయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news