ఎప్పటి నుంచో దక్షిణాది రాష్ట్రాల్లో బలపడాలని గురిపెట్టిన బిజెపి ఆశలు ఇప్పుడిప్పుడే తీరుతున్నట్టు గా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ,ఏపీలలో అధికారం సంపాదించాలని ఎప్పటి నుంచో బిజెపి కలలుకంటున్నా ,అది సాధ్యం కావడం లేదు. తెలంగాణలో ఈ మధ్య కాలంలో బీజేపీ బలం బాగా పెరిగింది. రాబోయే ఎన్నికల్లో అధికారం సాధించినా ఆశ్చర్యపోనవసరం లేదు అన్నట్లుగా బలోపేతం అయింది. కానీ ఏపీ విషయంలో కి వచ్చేసరికి బీజేపీ బాగా బలహీనంగా ఉంది. తెలంగాణ మాదిరిగా ఇక్కడ కూడా పూర్తి స్థాయిలో ఫోకస్ పెడితే అధికారం సంపాదించడం అంత కష్టమేమీ కాదు అనే అభిప్రాయం లో బీజేపీ అగ్రనేతలు ఉన్నారు. ఈ మేరకు తెలంగాణలో మాదిరిగా ఏపీలోనూ పార్టీని పటిష్టం చేసే విషయంపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.
తాజాగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తో తెలంగాణ ,ఏపీ బిజెపి అధ్యక్షులు బండి సంజయ్, సోము వీర్రాజు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం విషయమై చర్చించినట్లు సమాచారం. తెలంగాణలో బిజెపి అధ్యక్షుడిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఉప ఎన్నికలతో పాటు గ్రేటర్ లో ఊహించని విధంగా ఫలితాలు రావడంతో సంజయ్ ను అభినందించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో బలోపేతం చేసినట్టు గానే పార్టీని ఏపీలోనూ బలోపేతం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకే త్వరలో తిరుపతిలో ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
పూర్తిగా ఏపీలోనూ బండి సంజయ్ సేవలను ఉపయోగించుకుని బలపడాలని బిజెపి అధిష్టానం భావిస్తోంది. దీనికి బండి సంజయ్, సోము వీర్రాజు సానుకూలంగా స్పందించడంతో ఆపరేషన్ ఏపీ మొదలుపెట్టాలని పార్టీ అధిష్టానం భావిస్తోందట. సంజయ్ ఎంట్రీతో ఏపీలో అనూహ్య రాజకీయ మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది.