తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు పెండింగ్‌లో ఉన్న మూడు ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. వీరిలో ఖమ్మం అభ్యర్థిగా రామసహాయం రఘురాం రెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా రాజేందర్ రావు, హైదరాబాద్ అభ్యర్థిగా మహమ్మద్ సమీర్‌లను ప్రకటించింది. ఏఐసీసీ విడుదల చేసిన తుది జాబితాలో వీరికి టికెట్ దక్కింది. మరోవైపు త్వరలో జరగబోయే ఖమ్మం-నల్గొండ-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికకు, కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను ప్రకటించింది.
గత కొన్ని రోజులుగా కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ లోక్‌సభ స్థానాలకు అభ్యర్థుల ఖరారు సస్పెన్స్‌లో ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఖమ్మం స్థానం నుంచి అభ్యర్థి ఎంపిక, అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. ఈస్థానం నుంచి తమ కుటుంబసభ్యులకు టికెట్ కేటాయించాల్సిందిగా డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి పట్టుబట్టారు. చివరకు ఈ పంచాయితీ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వరకూ వెళ్లింది. అలా చివరకు పంచాయితీ ముగిసి ఎట్టకేలకు ఖమ్మం ఎంపీ స్థానానికి అభ్యర్థిని ప్రకటించారు.