‘సేవ్‌ ది యుటెరస్‌-స్ట్రెంతెన్‌ సొసైటీ’.. తెలంగాణ వైద్య దంపతుల వినూత్న ప్రచారం!

-

దేశంలోని కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు కాసుల కోసం పడే కక్కుర్తి ప్రజలకు శాపంగా మారుతున్నది. ముఖ్యంగా మహిళలు అవసరంలేని ఆపరేషన్లు చేయించుకుని అవస్థలు పడాల్సి వస్తున్నది. కాన్పు కోసం వెళ్తే బిడ్డ అడ్డం తిరిగిందనో, ఉమ్మనీరు తగ్గిందనో చెప్పి సిజేరియన్‌ చేయాలంటారు. కడుపులో నొప్పి అని వెళ్తే గర్భసంచికి పుండు పుట్టింది కోసి తీసేయాలంటారు. ఇలా అవసరం ఉన్నా, లేకున్నా ఆపరేషన్లు చేసి అందినికాడికి డబ్బు గుంజుతున్నారు.

అయితే చిన్న వయసులో గర్భాశయం తొలగించుకునే మహిళలు లేటు వయసులో నరకయాతన అనుభవించాల్సి వస్తుందట. భరించలేని నడుము నొప్పితో ఎక్కువసేపు నిలబడలేక, కుదరుగా కూర్చోలేక నిత్యం అవస్థలు పడాల్సి వస్తుందట. అందుకే గర్భాశయ తొలగింపు ఆపరేషన్లకు వ్యతిరేకంగా తెలంగాణకు చెందిన వైద్య దంపతులు ‘సేవ్‌ ది యుటెరస్‌-స్ట్రెంతెన్‌ సొసైటీ’ పేరుతో వినూత్న ప్రచారం చేపట్టారు.

డాక్టర్‌ సూర్యప్రకాశ్‌, డాక్టర్‌ ఎస్వీ కామేశ్వరి ఇద్దరూ గైనకాలజిస్టులు. చిన్న వయసులో గర్భాశయాలు తొలగించుకోవడంవల్ల మహిళలు పడుతున్న యాతన చూసి వారి మనసు చలించిపోయింది. అందుకే గర్భాశయం ప్రాముఖ్యత, దాన్ని తొలగించుకోవడంవల్ల జరిగే అనర్థాల గురించి పేద, నిరక్షరాస్య మహిళల్లో అవగాహన కల్పించాలని వారు నిర్ణయించుకున్నారు. దేశంలోని 400 జిల్లాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్న లక్ష్యంతో ప్రచారం మొదలుపెట్టి విజయవంతంగా కొనసాగిస్తున్నారు.

ఈ ప్రచార కార్యక్రమంపై డాక్టర్‌ కామేశ్వరి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 2019 నవంబర్‌లో ‘హెల్త్‌కేర్‌ ఫర్‌ విమెన్‌ ఇంటర్నేషనల్‌ జర్నల్‌’లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. దేశంలో గర్భాశయ తొలగింపు ఆపరేషన్లు పెరిగిపోవడానికి కారణం ప్రజలు ఎక్కువగా ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించడమేనని తెలిపారు. ఈ ప్రైవేటు ఆస్పత్రులవాళ్లు అవసరం ఉన్నా లేకున్నా డబ్బుల కోసం సర్జరీలు చేసి గర్భాశయాలు తొలగిస్తున్నారని చెప్పారు.

పాశ్చత్య దేశాల్లో గర్భాశయ తొలగింపు ఆపరేషన్లు చేయించుకునే మహిళల సగటు వయసు 44 ఏండ్లుగా ఉంటే.. మన దేశంలో అది 21-28 ఏండ్ల మధ్య ఉందని డాక్టర్‌ కామేశ్వరి చెప్పారు. అంటే విదేశాలతో పోల్చితే మన దేశంలో మహిళలు చాలా చిన్న వయసులో గర్భాశయాలు తొలగించుకుంటున్నారని, దీనివల్ల రకరకాల సైడ్‌ ఎఫెక్ట్స్‌ చుట్టుముట్టి అవస్థలు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు.

దేశంలో లక్షకు 12,000 మంది మహిళలు గర్భాశయాల తొలగింపు ఆపరేషన్లు చేయించుకున్నారని, వారిలో అవసరం లేకపోయినా ఆపరేషన్‌ చేయించుకున్నవారే ఎక్కువగా ఉన్నారని డాక్టర్‌ కామేశ్వరి తెలిపారు. కడుపునొప్పి, వైట్‌ డిశ్చార్జి వంటి చిన్నచిన్న కారణాలకు కూడా కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు గర్భాశయాలు తొలగిస్తున్నాయని, ఇది చాలా అనైతికమైన చర్య అని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు.

మహిళల అనారోగ్య సమస్యలను పురుషులు పెద్దగా పట్టించుకోవడం లేదని, గత కొన్ని రోజులుగా నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల ద్వారా తమకు ఈ విషయం స్పష్టమైందని డాక్టర్‌ సూర్యప్రకాష్‌ చెప్పారు. ఇప్పటికైనా మహిళల అనారోగ్య సమస్యలపై పురుషులు దృష్టిపెట్టకపోతే గర్భాశయాల తొలగింపు అనే దుఃసాంప్రదాయం ఇలాగే కొనసాగుతుందని, పురుషులుగా మహిళల బాగోగులు చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన అన్నారు.

2015-16 నాటి నేషనల్‌ ఫ్యామిలీ హెల్త్‌ సర్వే వెల్లడించిన డాటా ప్రకారం.. తెలంగాణలో 40-49 ఏండ్ల మధ్య వయసు మహిళల్లో 20.1 శాతం మంది గర్బాశయాలు తొలగించుకున్నారని డాక్టర్‌ కామేశ్వరి దంపతులు తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇది 22 శాతంగా ఉందని చెప్పారు. అందుకే తాము దేశమంతా తిరిగి గర్భాశయ ప్రాముఖ్యత గురించి, దాన్ని తీసేయించుకోవడం వల్ల ఒనగూరే అనర్థాల గురించి అవగాహన కల్పిస్తున్నామని వైద్య దంపతులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news