నిజ జీవితంలో జరిగే సంఘటనల ఆధారంగానే సాధారణంగా దర్శక నిర్మాతలు ఎవరైనా సరే సినిమాలు తీస్తుంటారు. వాటిల్లో కొంత కల్పిత కథలను జోడించి సినిమా కథలను తయారు చేస్తుంటారు. అయితే సినిమాల్లో చూపించినవి నిజానికి వాస్తవ జీవితంలో జరగాలని ఏమీ లేదు. కానీ ఓ మూవీ మాత్రం నిజంగా ప్రస్తుతం సమాజంలో నెలకొన్న పరిస్థితులను ఒకప్పుడే కళ్లకు కట్టినట్టు చూపించింది. అప్పుడు ఆ మూవీలో చూపించిన విధంగానే ఇప్పుడు జరుగుతోంది. ఇంతకీ అది ఏం మూవీ..? అందులో ఏం చూపించారు..? అందుకు తగిన విధంగా ఇప్పుడు ఏం జరుగుతోంది..? అనేది తెలుసుకోవాలంటే.. చదవండి మరి..
contagion (కంటేజియన్). ఇదొక హాలీవుడ్ మూవీ. 2011లో వచ్చింది. అందులో ఓ వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది చనిపోతుంటారు. చివరకు ఆ వైరస్‌కు వ్యాక్సిన్‌ను కనుగొని దాన్ని అంతం చేస్తారు.. ఇదీ కథాంశం.. ఈ మూవీలో చూపించిన వైరస్‌కు ఎంఈవీ-1 అని నామకరణం చేస్తారు. ఇది మొదటగా ఓ గబ్బిలం నుంచి పందికి వ్యాపిస్తుంది. దాన్ని వండిన ఓ చెఫ్‌కు, ఆ తరువాత అతని నుంచి ఓ మహిళకు వ్యాపిస్తుంది. ఆ మహిళ హాంగ్‌కాంగ్ నుంచి అమెరికా వచ్చే వరకు అనేక దేశాలకు చెందిన వారికి ఆ వైరస్ వ్యాపిస్తుంది. అలా ఎంఈవీ-1 వైరస్ విస్తరిస్తుంది. ఇక ఈ వైరస్‌కు, ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనా వైరస్‌కు చాలా పోలికలు ఉన్నాయి. మూవీలో చూపించిన ఎంఈవీ-1 వైరస్ ఒకరికొకరు తాకడం వల్ల లేదా వారు ముట్టుకున్న వస్తువులను మరొకరు ముట్టుకోవడం వల్ల, దగ్గడం వల్ల వస్తుంది. ఈ క్రమంలో వైరస్ వచ్చిందని తెలియగానే ప్రస్తుతం మనం అనుసరిస్తున్నట్లుగానే మూవీలోనూ చేతులను హ్యాండ్ శానిటైజర్లతో శుభ్రం చేసుకోవడం, మాస్క్‌లు ధరించడం చేస్తారు. ఇక ఒకరికొకరు తాకాలన్నా, ఎదుటి వారితో కనీసం మాట్లాడాలన్నా మూవీలో భయపడిపోతుంటారు. ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల మనం కూడా అలాగే చేస్తున్నాం. దీంతో జనాలు పెద్ద ఎత్తున ఒకే చోట ఉండకుండా ప్రభుత్వాలు ఆంక్షలు విధించాయి.
ఇక మూవీలో ఎంఈవీ-1 వైరస్ సోకిన వ్యక్తులకు ముందుగా దగ్గు, జ్వరం వస్తాయి. తరువాత కొన్ని గంటల్లోనే ఫిట్స్ వచ్చి చనిపోతుంటారు. ఈ క్రమంలో కరోనా వైరస్ కూడా సోకగానే దాదాపుగా అలాంటి లక్షణాలనే ప్రదర్శిస్తుంది. కానీ దీని వల్ల అంత త్వరగా మరణం రాదు. కాకపోతే సినిమాలో చూపించిన వైరస్‌కు, కరోనాకు కొన్ని పోలికలను మాత్రం మనం గమనించవచ్చు. ఇక మూవీలో అమెరికాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ వారు ఎంఈవీ-1 వైరస్‌కు వ్యాక్సిన్ తయారు చేసి దాన్ని జనాలకు విడతల వారీగా సరఫరా చేస్తారు. దీంతో వైరస్ అంతం అవుతుంది. ఓవరాల్‌గా ఈ మూవీ యావరేజ్ అనిపించినా.. ప్రస్తుతం విజృంభిస్తున్న కరోనా వైరస్ లాంటి మరొక వైరస్ నేపథ్యంలో ఈ మూవీని తీయడంతో దీన్ని చాలా మంది ఇప్పుడు వీక్షిస్తున్నారు.
ఇక అప్పట్లో ఈ మూవీకి పెద్దగా ఆదరణ లభించలేదు. బాక్సాఫీస్ వద్ద కూడా బిలో యావరేజ్ మూవీగా స్థిరపడిపోయింది. కానీ ప్రస్తుతం వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ను పోలిన కథాంశం ఈ మూవీలో ఉండడంతో దీన్ని చాలా మంది ఇప్పుడు డౌన్‌లోడ్ చేసుకుని మరీ చూస్తున్నారు. ఈ మూవీని ఇప్పటికే కొన్ని లక్షల మంది వీక్షించారని సమాచారం. ఆపిల్ ఐట్యూన్స్‌లో ఎక్కువగా డౌన్‌లోడ్ అవుతున్న మూవీల జాబితాలో ఈ మూవీ టాప్ ప్లేసులో కొనసాగుతోంది. అయితే అప్పుడు ఆ మూవీ తీసిన దర్శక నిర్మాతలకు భవిష్యత్తులో కరోనా వైరస్ విజృంభిస్తుందని తెలియదు. కానీ వారు అలా ఓ అంచనా వేసి ఆ మూవీని తీశారు. అయితే ఇప్పుడు దాదాపుగా అందులో చూపించినట్లే ఓ వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. ఈ క్రమంలో ఆ మూవీని ఇప్పుడు జనాలు వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఏది ఏమైనా.. మూవీలో వైరస్‌ను వ్యాక్సిన్‌తో అంతం చేసినట్లు.. కరోనా వైరస్ ను కూడా మనం త్వరగా వ్యాక్సిన్‌తో అంతం చేయాలని కోరుకుందాం..!