తెలంగాణ ఎంసెట్‌ షెడ్యూల్‌ విడుదల.. ఫిబ్రవరి 21 నుంచి దరఖాస్తులు ప్రారంభం

-

తెలంగాణ ఎంసెట్‌ కమిటీ.. 2020 సంవత్సరానికిగాను ఎంసెట్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఖరారుచేసింది. ఇంజినీరింగ్‌, అగ్రికల్చరల్‌ కోర్సులు చదవాలనుకునే విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఈ పరీక్షలకు సంబంధించి ఫిబ్రవరి 21 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. విద్యార్థులు ఎలాంటి లేట్‌ ఫీజు లేకుండా మార్చి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో తెలంగాణ ఎంసెట్‌ కమిటీ సమావేశమై పరీక్షల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి, జేఎన్‌టీయూ ఇన్‌చార్జి వీసీ జయేష్‌రంజన్, ఎంసెట్‌ కన్వీనర్‌ ప్రొఫెసర్‌ గోవర్ధన్, కో కన్వీనర్‌ చంద్రమోహన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇవి తెలుసుకోండి..
1. 2020 ఎంసెట్‌ పరీక్షల్లో ఈడబ్ల్యూఎస్‌ (ఆర్థికంగా వెనుకబడిన వర్గాల) కోటా అమలుపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి జీవో జారీచేయలేదు. అయితే ఒకవేళ ప్రభుత్వం జీవో ఇస్తే అమలు చేయడానికి వీలయ్యేలా.. దరఖాస్తుల్లో ఈడబ్ల్యూఎస్‌ ఆప్షన్‌ను పొందుపర్చారు. తమకు ఈడబ్య్లూఎస్‌ కోటా వర్తిస్తుందని భావించే విద్యార్థులు ఆ ఆప్షన్‌పై టిక్‌ పెట్టాలని అధికారులు సూచించారు.
2. ఇంజినీరింగ్‌ కోర్సులో చేరడానికి ఇంటర్‌లో రసాయనశాస్త్రం అవసరం లేదని ఏఐసీటీఈ చెబుతున్నప్పటికీ.. అందుకు అనుగుణంగా ఎలాంటి మార్పులు చేయడంలేదని ఎంసెట్‌ కమిటీ తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ జీవోల ప్రకారమే తాము నడుచుకుంటామని, ఒకవేళ ప్రభుత్వం ఈ విషయమై జీవో ఇస్తే సంబంధిత మార్పులు చేస్తామని చెప్పారు.
3. ఈ సారి దరఖాస్తు ఫీజుల్లో పెద్దగా మార్పులు చేయలేదు. అయితే దివ్యాంగులకు మాత్రం ఎస్సీ, ఎస్టీలతో సమానంగా రూ.400 ఫీజు నిర్ణయించారు.
4. తెలంగాణలో 16, ఏపీలో 4 చొప్పున మొత్తం 20 పరీక్షల జోన్లు ఉన్నాయి. ఈ 20 జోన్ల పరిధిలో మొత్తం 55 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. కాగా, ఈ సారి కొత్తగా కోదాడను ఎంసెట్‌ పరీక్షల జోన్‌గా చేర్చారు.

ఇదీ షెడ్యూల్‌
ఎంసెట్‌ నోటిఫికేషన్‌ విడుదల – ఫిబ్రవరి 19
ఆన్‌లైన్‌ దరఖాస్తులు – ఫిబ్రవరి 21 నుంచి మార్చి 30 వరకు
దరఖాస్తుల్లో తప్పులు సరిదిద్దుకునే అవకాశం – మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 3 వరకు
రూ.500 లేట్‌ ఫీజుతో దరఖాస్తులు – మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 6 వరకు
రూ.1,000 లేట్‌ ఫీజుతో దరఖాస్తులు – ఏప్రిల్‌ 7 నుంచి 13 వరకు
రూ.5,000 లేట్‌ ఫీజుతో దరఖాస్తులు – ఏప్రిల్‌ 14 నుంచి 20 వరకు
రూ.10,000 లేట్‌ ఫీజుతో దరఖాస్తులు – ఏప్రిల్‌ 21 నుంచి 27 వరకు
హాల్‌టికెట్ల డౌన్‌లోడింగ్‌ – ఏప్రిల్‌ 20 నుంచి మే 1 వరకు
ఇంజినీరింగ్‌ విభాగం పరీక్షలు – మే 4, 5, 7 తేదీల్లో
అగ్రికల్చర్‌ విభాగం పరీక్షలు – మే 9, 11

Read more RELATED
Recommended to you

Latest news