తెలంగాణ ఉద్యోగ సంఘాలలో కొత్త టెన్షన్‌ అందుకేనా ?

-

పీఆర్సీ నివేదిక ఇచ్చాక ఉద్యోగుల్లో కొత్త టెన్షన్‌ మొదలైందట. ఆ నివేదికలో ఏముంది? వేతన సవరణ ఎంత సిఫారసు చేసింది? తమ విజ్ఞప్తులను ఏ మేరకు కమిషన్‌ పరిగణనలోకి తీసుకుంది? అని ఆందోళన చెందుతున్నట్టు సమాచారం. కమిషన్‌ రిపోర్ట్‌ సరే.. సీఎం మనసులో ఏముందని కూడా చర్చ జరుగుతోందట. గతంలో ఇచ్చినస్థాయిలో ఈసారి ఫిట్‌మెంట్‌ ఇస్తారా లేదా అనే చర్చ మొదలైందట.


తెలంగాణ ప్రభుత్వం 2018 మే నెలలో వేతన సవరణ సంఘం వేసింది. ఆ సమయంలో 3 నెలల్లో ఇవ్వాల్సి ఉంది. కానీ.. 30 నెలల తర్వాత రిపోర్ట్‌ ఇచ్చింది బిస్వాల్‌ బృందం. మొన్నటి వరకు మళ్లీ పే రివిజన్‌ కమిషన్‌ PRC గడువు పెంచుతారేమో.. నివేదికకు ఇంకా టైమ్‌ పడుతుందేమోనని భయపడ్డాయి ఉద్యోగ సంఘాలు. ఎట్టకేలకు PRC రిపోర్ట్‌ ఇవ్వడంతో ఊపిరి పీల్చుకున్నాయి.

వేతన సవరణపై కమిషన్‌ ఎంత సిఫారసు చేసింది? ఫిట్‌మెంట్‌పై సీఎం మదిలో ఏముంది అన్నదానిపై ఇప్పుడు ఉద్యోగ సంఘాలు తెగ ఆందోళన చెందుతున్నాయట. గతంలో సీఎం కేసీఆర్‌ 43 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చారు. అప్పుడు ఉద్యోగులు, ఉద్యోగ సంఘాలు హ్యాపీ ఫీలయ్యాయి. ఈసారి ఫిట్‌మెంట్‌పై బయట జరుగుతున్న ప్రచారంతో ఉద్యోగుల గుండెలు గుభేల్‌ మంటున్నాయి. పీఆర్సీ ప్రకటించకపోవడం, ఉద్యోగుల పెండింగ్‌ సమస్యలు అలాగే తిష్టవేయడంతో రేపటి రోజున ఫిట్‌మెంట్‌లో తేడా వస్తే ఉద్యోగులు తమ జుట్టు పట్టుకుంటారని ఆయా సంఘాల నాయకులు భయపడుతున్నారట.

అలాగే వేతన సవరణను జూన్‌ 2018 నుంచి అమలు చేయాలన్నది కొందరు ఉద్యోగుల డిమాండ్‌. కానీ.. ఇప్పుడు రిపోర్ట్‌ ఇచ్చినప్పటి నుంచో లేక 2021 ఏప్రిల్‌ ఒకటి నుంచో అమలు చేయవచ్చునని అనుకుంటున్నారు. ఈ ఏడాది నుంచే వేతన సవరణ జరుగుతుందని చెబితే దానివల్ల తలనొప్పులు తప్పవని ఉద్యోగ సంఘాల నేతలు కలవర పడుతున్నారట. ఆమోద యోగ్యమైన పీఆర్సీని సాధించుకున్నా.. 2018 జూన్‌ నుంచి అమలులోకి రాకపోతే అపవాదు మూటకట్టుకోక తప్పదని సీఎంతో టచ్‌లో ఉన్న ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన చెందుతున్నట్టు సమాచారం.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 27 శాతం మధ్యంతర భృతి ఇస్తోందని.. ఇక్కడ అలా ఇవ్వడం లేదని తెలంగాణ ఉద్యోగులు ఒకింత అసంతృప్తిలో ఉన్నారట. ఈ విషయాన్ని పట్టించుకోకుండా ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వనికి వత్తాసు పలకడాన్ని తప్పుపడుతున్నాయి విపక్ష పార్టీలు. ఆ దిశగా దాడి కూడా తీవ్రం చేశాయి. మరి.. వేతన సవరణ, ఫిట్‌మెంట్‌ల పై సీఎం నిర్ణయం ఎలా ఉంటుందో? తమను ముంచుతారో తేల్చుతారో అని ఎవరికి తెలిసిన లెక్కలు వారు వేసుకుంటున్నారట. పీఆర్సీ వేయడం ఒక ఎత్తు అయితే.. పీఆర్సీ నివేదిక ఇవ్వడం..దానిని ప్రభుత్వం ఆమోదించడం.. ఫిట్‌మెంట్ ప్రకటన ఉద్యోగులను మరింత టెన్షన్‌ పెడుతున్నాయి. ఏ నలుగురు ఉద్యోగులు కలిసినా దీనిపైనే చర్చించుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి

Read more RELATED
Recommended to you

Latest news