కరోనా బాధితులు హాస్పిటల్స్‌కు వస్తే వారిని వెనక్కి తిప్పి పంపించకూడదని, నాలుగైదు హాస్పిటళ్లు తిప్పే పరిస్థితి తేకూడదని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై రాష్ట్రంలోని ప్రైవేటు హాస్పిటల్స్‌ను హెచ్చరించారు. మంగళవారం ఆమె రాష్ట్రంలో కోవిడ్ చికిత్స అందిస్తున్న 11 ముఖ్యమైన ప్రైవేటు హాస్పిటల్స్ ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తమిళిసై కరోనాపై ప్రైవేటు హాస్పిటల్స్ యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేశారు. కోవిడ్ బాధితులను మానవత్వంతో చూడాలన్నారు. వారు హాస్పిటల్‌కు వస్తే వెంటనే చికిత్స అందించాలని.. వెనక్కి పంపకూడదని అన్నారు.
కరోనా రోగులకు ప్రైవేటు హాస్పిటల్స్ మెరుగైన చికిత్సను అందించాలని తమిళిసై అన్నారు. నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, రోగులకు తాము ఉన్నామనే భరోసాను ప్రైవేటు హాస్సిటల్స్ కల్పించాలని అన్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు హాస్పిటళ్లు కరోనా చికిత్స కోసం వచ్చే పేషెంట్ల పట్ల బాధ్యతగా ప్రవర్తించాలన్నారు. మానవత్వంతో చికిత్స అందించాలన్నారు.
కరోనా పాజిటివ్ రోగులకు అవసరం ఉంటేనే టెస్టులు చేయాలన్నారు. బాధ్యతతో టెస్టులు చేయాలని తమిళిసై సూచించారు. ప్రైవేటు హాస్పిటళ్లు అవసరం అయితే తమకు అనుబంధంగా ఉండే మెడికల్ కాలేజీల సహాయం తీసుకోవాలని సూచించారు. ఎట్టి పరిస్థితిలోనూ కరోనా రోగుల నుంచి భారీ చార్జిలను వసూలు చేయరాదని గవర్నర్ తేల్చి చెప్పారు.