తెలంగాణ : 4 కామన్ ఎంట్రెన్స్ పరీక్షలు రీషెడ్యూల్ !

తెలంగాణలో కరోనా వైరస్ విలయం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో తెలంగాణ విద్యా మండలి కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలో జరగాల్సిన నాలుగు కామన్ ఎంట్రెన్స్ పరీక్షలను రీషెడ్యూల్ చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది ఉన్నత విద్యా మండలి. జూలై 5 నుంచి 9 వరకు జరగాల్సిన ఎంసెట్ పరీక్షలను ఆగస్టు నెలకు వాయిదా వేసింది ఉన్నత విద్యా మండలి. కొత్త తేదీలను ప్రభుత్వ ఆమోదం కోసం పంపింది . పీఈ సెట్ మరియు పీజీఈసెట్ తేదీలలో కూడా మార్పులు చేసింది ఉన్నత మండలి.

వాయిదా వేసిన ఈ పరీక్షలను ఆగస్టు 1 వ తారీకు నుంచి 15 మధ్యలో నిర్వహించే అవకాశం కనిపిస్తోంది. అయితే దీనిపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇక తెలంగాణలో రెండు లక్షల 25 వేలు దాటాయి ఎంసెట్ దరఖాస్తులు. ఇంజినీరింగ్ స్ట్రీమ్ లో లక్ష 49 వేల 606 దరఖాస్తులు రాగా.. అగ్రికల్చర్, మెడికల్ స్ట్రీమ్ లో 75 వేల 519 అప్లికేషన్లు వచ్చాయి. మొత్తం దరఖాస్తులు 2 లక్షల 25 వేల 125 కు చేరుకున్నాయి. గత ఏడాదితో పోలిస్తే దరఖాస్తులు పెరిగాయి. గత ఏడాది దరఖాస్తులు సుమారు 2 లక్షల 22 వేలు వచ్చాయి.