కన్నీరు పెట్టుకున్న తెలంగాణా మంత్రి…

నిన్న రాత్రి జమ్మూలో జరిగిన ఒక ఎన్ కౌంటర్ లో ముగ్గురు జవాన్లు వీర మరణం పొందారు. ఈ కాల్పుల్లో తెలంగాణాకు చెందిన ఓ జవాన్ కూడా మరణించారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కోమన్ పల్లి గ్రామానికి చెందిన వీర జవాన్ ర్యాడ మహేష్ మరణించడంతో ఆయన ఇంట విషాద చాయలు అలుముకున్నాయి. ఆయన చిత్రపటానికి ప్రభుత్వం తరపున మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, పోలీస్ కమిషనర్ కార్తికేయలు నివాళులర్పించారు.

మహేష్ వీరమరణం తలుచుకుని మంత్రి ప్రశాంత్ రెడ్డి కన్నీరు పెట్టారు. వీర మరణం పొందిన మహేష్ కుటుంబాన్ని అన్నిరకాలుగా ఆదుకుంటామని ఆయన అన్నారు. జవాన్ కుటుంబానికి సీఎం కేసీఆర్ అండగా ఉంటారన్న ఆయన సైనిక, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపిస్తామని అన్నారు. రేపు సాయంత్రం మహేష్ పార్థివ దేహం హైదరాబాద్ చేరుకుంటుందని, ఎల్లుండి స్వగ్రామంలో అంత్యక్రియలు జరుపుతామని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.