సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్‌కు చెందిన ఆపిల్ వాచ్ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. అందుకు గాను ఆ వ్యక్తి కుమారుడు ఆపిల్‌కు కృతజ్ఞతలు తెలిపాడు.
సాఫ్ట్‌వేర్ సంస్థ ఆపిల్‌కు చెందిన ఆపిల్ వాచ్ ఓ వ్యక్తి ప్రాణాలను కాపాడింది. అందుకు గాను ఆ వ్యక్తి కుమారుడు ఆపిల్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. ఈ ఘటన అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. గతంలో ఆపిల్ వాచ్ గుండె పోటు వచ్చే విషయాన్ని ముందుగానే పసిగట్టి చెప్పి పలువురిని హార్ట్ ఎటాక్‌ల నుంచి కాపాడిన విషయం మరువక ముందే.. తాజాగా ఇప్పుడీ ఘటన మరోసారి అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..?
వాషింగ్టన్ స్టేట్‌లోని స్పోకేన్ సిటీ శివారులో ఉన్న పర్వతాల వద్ద గేబ్ బర్డెట్ అనే వ్యక్తి తన తండ్రి బాబ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. వారు మౌంటెయిన్ బైకింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే బాబ్ తన కుమారుడు బర్డెట్ వద్దకు సైకిల్‌పై చేరుకోవాల్సి ఉంది. కానీ బాబ్ మార్గమధ్యలో కింద పడ్డాడు. దీంతో అతని చేతికున్న ఆపిల్ వాచ్ బాబ్ కింద పడడాన్ని గుర్తించి అందులో సేవ్ అయి ఉన్న బర్డెట్ ఫోన్ నంబర్‌కు మెసేజ్ పంపించింది. అలాగే ఆ లొకేషన్ వివరాలను, బాబ్ సమాచారాన్ని ఆపిల్ వాచ్ అమెరికాలోని ఎమర్జెన్సీ నంబర్ 911కు చేరవేసింది. దీంతో సమాచారం అందుకున్న 911 సిబ్బంది సంఘటనా స్థలానికి కేవలం 30 నిమిషాల్లోనే చేరుకుని బాబ్‌ను రక్షించారు. వెంటనే అతన్ని సమీపంలోని మరో ఆసుపత్రికి తరలించారు.
అయితే బాబ్ పడిపోయాడన్న సమాచారం తెలుసుకున్న అతని కుమారుడు బర్డెట్ తండ్రి కోసం ఆ లొకేషన్‌కు వెళ్లగా అతను అక్కడ కనిపించలేదు. కానీ వెంటనే మరొక మెసేజ్ వచ్చింది. బాబ్‌ను సమీపంలో ఉన్న ఓ హాస్పిటల్‌లో చేర్పించారని, ఆయనకు చికిత్సనందిస్తున్నారని ఆ మెసేజ్‌లో ఉండడంతో బర్డెట్ ఊపిరి పీల్చుకున్నాడు. ఇక తన తండ్రిని రక్షించినందుకు గాను అతను ఆపిల్‌కు కృతజ్ఞతలు తెలిపాడు. కాగా ఆపిల్ విడుదల చేసిన వాచ్ సిరీస్ 4, 5 వాచ్‌లలో ఫాల్ డిటెక్షన్ అనే ఫీచర్‌ను అందిస్తున్నారు. దీని వల్ల ఆయా వాచ్‌లను ధరించిన వారు కింద పడితే వెంటనే వాచ్ గుర్తించి అందులో ఫీడ్ అయి ఉన్న ఎమర్జెన్సీ నంబర్లకు ఆ సమాచారాన్ని చేరవేస్తుంది. దీంతో వెంటనే అప్రమత్తమై ప్రమాదానికి గురైన వారి ప్రాణాలు రక్షించేందుకు అవకాశం ఉంటుంది. కాగా ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారింది.