గత కొద్దిరోజులుగా భాగ్యనగరంపై భానుడి భగభగలు తీవ్రంగా ఉంటున్నాయి. మండుతున్న ఎండలు, ఉక్కపోతతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరిబిక్కిరై పోతున్నారు. ఉదయం 10 దాటిందంటే బయటకు రావడానికి జంకుతున్నారు. ఇక మధ్యాహ్నం పూట వాహనదారులు ఎండ వేడిమికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఉక్కపోతతో ఇబ్బందులు పడుుతన్న రాష్ట్ర ప్రజలకు చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. మరోవైపు సోమవారం రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదుకాగా..మరికొన్ని చోట్ల భారీ వర్షాలు పడ్డాయి.
కాగా రాష్ట్రంలో మే నెలలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు సోమవారం వడగాలుల హెచ్చరికల నివేదికను విడుదల చేసింది. మరోవైపు పలు జిల్లాల్లో సాధారణ వర్షపాతం కన్నా ఎక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ డైరెక్టర్ కె.నాగరత్న పేర్కొన్నారు.