- ఉచితంగా త్రిచక్ర వాహనాలు, వీల్‌చైర్స్ అందిస్తున్న తెలంగాణ సర్కార్
- వినికిడి యంత్రాలు, లాప్‌టాప్స్, 4జీ స్మార్ట్ ఫోన్స్, చెతికర్రలు కూడాను..
- ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 6 వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తుల స్వీకరణ
- రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్
హైదరాబాద్ః దివ్యాంగులకు గుడ్ న్యూస్ ! తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు అవసరమైన పలు ఉపకరణాలను ఉచితంగా అందిస్తున్నది. ఈ ఉపకరణాలలో త్రిచక్ర వాహనాలు, వీల్‌చైర్స్ లు సహా వినికిడి యంత్రాలు, లాప్‌టాప్స్, 4జీ స్మార్ట్ ఫోన్స్, ఎంపీ త్రీ ప్లేయర్స్, చెతిర్రలు కూడా ఉన్నాయి. దివ్యాంగులకు ఉపకరణాలు అందించడం కోసం ప్రత్యేకంగా తీసుకువచ్చిన ఈ పథకం వివరాలను తాజాగా తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి, దివ్యాంగుల సంక్షేమ శాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాకు వెల్లడించారు.
ఈ వివరాల ప్రకారం.. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల కోసం త్రిచక్ర వాహనాలు, వీల్‌చైర్స్ లు, వినికిడి యంత్రాలు, లాప్‌టాప్స్, 4జీ స్మార్ట్ ఫోన్స్, ఎంపీ త్రీ ప్లేయర్స్, చెతిర్రలు వంటి వివిధ రకాలైన ఉపకరణాలను ఉచితంగా అందిస్తోంది. 2020-21 అర్థిక సంవత్సరంలో వివిధ రకాలైన దాదాపు 13,195 ఉపకరణాలను ప్రభుత్వం దివ్యాంగులకు అందిస్తోంది. దీని కోసం ప్రభుత్వం రూ.20.41 కోట్లను ఖర్చు చేస్తోంది. అర్హులైన లబ్దిదారులు ఈ నెల 25వ తేది నుంచి వచ్చే నెల (పిబ్రవరి) 6 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు www.obmms.cgg.gov.in వెబ్ సైట్ ను లాగిన్ అవ్వండి.
అలాగే, దివ్యాంగులకు ఉపకరణాల పంపిణీలో భాగంగా రూ.90,000 విలువ చేసే రిట్రోఫెట్టెడ్ మోటర్ వాహనాలను సైతం అవసరమైన వారికి అందిస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వరు తెలిపారు. వీటి కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టు తిరిగే అవసరం లేకుండానే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకునే సదుపాయాన్ని ప్రస్తుతం అందుబాటులోకి తీసుకువచ్చామనీ, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. కాగా, అర్హులైన లబ్దిదారులను జిల్లా కమిటీ ఎంపిక చేసిన అనంతరం ఫిబ్రవరి 15 నుంచి ఈ ఉపకరణాలను ఉచితంగా అందజేయనున్నామని మంత్రి వివరించారు.