బీఆర్ఎస్ హయాంలో ఉపాధిహామీ కూలీలకు కనీసం వంద రోజుల ఉపాధి కూడా కల్పించలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విమర్శించారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ని విమర్శించడం ఆ పార్టీ నేతలు మానుకోవాలన్నారు. ఆగస్టు 15న రుణమాఫీ హామీ నిలబెట్టుకుంటామని చెప్పారు. ఎమ్మెల్యే పదవి వదులుకునేందుకు హరీశ్ రావు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.
గతంలో తాను మంత్రి పదవీని తృణప్రాయంగా వదులుకున్నానని.. మెదక్ లో బీఆర్ఎస్ కనీసం డిపాజిట్ దక్కించుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు రాలేదు. ఇప్పుడు కర్ర పట్టుకుని వస్తున్నారు. సచివాలయానికి రేవంత్ రెడ్డి వచ్చిన దాంట్లో పది శాతం కూడా ఆయన రాలేదు. మూడు నెలల్లో రేవంత్ 60 సార్లు సచివాలయానికి వచ్చారు. కేసీఆర్ పాలనలో హోంమంత్రికి కూడా అపాయింట్మెంట్ లేదు. పార్టీ మూతపడే స్థితికి వచ్చినందున ఎక్కడికి వెళ్లాలో వారికి అర్థం కావట్లేదు. రైతులపై ప్రేమ ఉన్నట్లు హరీశ్ రావు నాటకాలాడుతున్నారు.
రాజీనామా పత్రం ఒకటిన్నర పేజీ రాశారు. నిజానికి అది ఒకటిన్నర లైను మాత్రమే ఉండాలి. అంతకు మించితే ఆమోదం పొందదు. కాంగ్రెస్ వచ్చాక ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు ఇస్తున్నాం. దొంగ రాజీనామా లేఖలను ఎందుకు ఇస్తున్నారు. హామీలు అమలు చేయకపోతే ప్రజలను క్షమాపణ కోరి ఉండేవాళ్లమన్నారు.