తెలంగాణ అసెంబ్లీ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన 30 శాతం కమీషన్ల వ్యాఖ్యలు అధికార, విపక్ష పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీశాయి. సభలో తమకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ సభ్యులు వాకౌట్ చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేటీఆర్ మాట్లాడారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పై తనకు అపారమైన గౌరవం ఉందన్నారు. 2009 నుంచి ఆయనతో కలిసి పని చేస్తున్నానని తెలిపారు.
కానీ సభ ఆర్డర్ లో జరగడం లేదని.. సభాపతిగా ఉన్న గడ్డం ప్రసాద్ కుమార్ తమ హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విప్ గా ఉన్న ఆది శ్రీనివాస్ కమిషన్ కే అంటే కాకతీయ అని.. కమీషన్ కే అంటే కరెంట్ కొనుగోళ్లు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారని.. అవన్ని అనుచిత వ్యాఖ్యలు కావా.. అని స్పీకర్ ను ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ అని.. రూ.50 కోట్లు పెట్టి పీసీసీ చీఫ్ పదవీ తెచ్చుకున్నాడని తాను అనొచ్చని తెలిపారు.