అకాల వర్షాలతో అపారంగా నష్టపోయిన ఖమ్మం, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో రైతులను ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శించిన విషయం తెలిసిందే. అలాగే వర్షాలకు దెబ్బతిన్న పంటలను కూడా పరిశీలించారు. అనంతరం రైతులకు సాయంగా ఎకరాకు రూ.10వేల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.
సీఎం ప్రకటనకు అనుగుణంగా ప్రభుత్వం జీవో జారీ చేసింది. జాతీయ విపత్తు నిర్వహణ నిబంధనలకు లోబడి ఎస్‌డీఆర్ఎఫ్ నిధులు వినియోగించుకోవాలని, మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి చెల్లించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు ఏప్రిల్ 15 నుంచి రైతులకు ఆర్థిక సాయాన్ని అందజేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్రవ్యాప్తంగా 2,22,250 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అందులో మొక్కజొన్న 1,29,446 ఎకరాలు, వరి 72,709 ఎకరాలు, మామిడి 8,865 ఎకరాలు, ఇతర పంటలకు 17,238 ఎకరాల్లో నష్టం జరిగినట్టు తేల్చారు. ఈ మేరకు ఆయా పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10,000 చొప్పున ఆర్థిక సాయం అందనుంది.
ప్రకృతి విపత్తుల కారణంగా నష్టపోయిన రైతులు ధైర్యం కోల్పోవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కౌలు రైతులకు తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్ని కష్టాలెదురైనా వ్యవసాయాన్ని వదలొద్దని.. సాగును పట్టుదలగా చేసి సత్ఫలితాలు చూపించాలని పిలుపునిచ్చారు.