హైదరాబాద్లో మంగళవారం రాత్రి భారీ వర్షం నగరాన్ని అతలాకుతలం చేసింది. కురిసిన మూడు నాలుగు గంటల్లో విలయం సృష్టించింది. వర్షాల కారణంగా వేర్వేరు ప్రమాదాల్లో నగరవ్యాప్తంగా 14 మంది మృత్యు వాతపడ్డారు. ఇందులో 10 మంది ఇతర రాష్ట్రాల వలస కార్మికులే ఉండటం గమనార్హం. బాచుపల్లిలో కౌసల్యకాలనీలో నిర్మాణంలో ఉన్న ఓ అపార్ట్‌మెంట్ ప్రహరీ మంగళవారం రాత్రి ఒక్కసారిగా కూలిపోయి దానిని ఆనుకొని ఉన్న రేకుల షెడ్డుపై పడింది. దీంతో అందులో నివసిస్తున్న ఏడుగురు కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. మొయినాబాద్ మండలం చిన్నమంగళారానికి చెందిన జహేరాబేగం(47) మంగళవారం రాత్రి కూరగాయలు కొనేందుకు బయటకు రాగా స్వాగత తోరణం విరిగి ఆమె తలపై పడి మరణించింది.
పెద్దఅంబర్‌పేట్ పురపాలిక పరిధిలో విద్యుత్ తీగ తగలడంతో ఓ బాలుడు మరణించాడు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఓ వ్యక్తి.. వర్షంలో తన పంక్చర్ దుకాణం బయట ట్యూబ్‌లైట్ తీస్తుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు. బిహార్‌కు చెందిన ఓ వ్యక్తి చందానగర్‌లోని గంగారంలో తాను పని చేసే టీ బండిని విద్యుత్ స్తంభానికి గొలుసుతో కడుతుండగా విద్యుదాఘాతానికి గురై మృతిచెందారు. మూసారాంబాగ్ మెట్రోస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి(45) మంగళవారం రాత్రి వర్షానికి జారి పడి మరణించాడు. ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులు బేగంపేట నాలాలో ప్రమాదవశాత్తు పడి మృతిచెందారు.