తెలంగాణలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాల్లో గురు, శుక్రవారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పారు. తూర్పు విదర్భ నుంచి తెలంగాణ, ఏపీలోని రాయలసీమ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు మంగళవారం ఏర్పడిన ద్రోణి కొనసాగుతోందని వెల్లడించారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 12వ తేదీ వరకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు, జల్లులు కురవనున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. 12వ తేదీన కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు (ఆరెంజ్) కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక మంగళవారం రోజున రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలు ఎంతటి విలయం సృష్టించాయో తెలిసిందే. పంటలు నీటిపాలై, నేలరాలి రైతులు కుదేలయిపోయారు. మరోవైపు హైదరాబాద్లో వర్షం కారణంగా 14 మంది మరణించారు. అయితే వాన కురవడం వల్ల బుధవారం ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జకోరా, నిజామాబాద్ అర్బన్‌లో 42.9 డిగ్రీలు నమోదైంది.