రాష్ట్రవ్యాప్తంగా హోలీ పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. అయితే పలు ప్రాంతాల్లో మాత్రం ఈ రంగుల కేళీ విషాదం నింపింది. పండుగ పూట రాష్ట్ర వ్యాప్తంగా వేర్వేరు దుర్ఘటనల్లో 17 మంది దుర్మరణం చెందారు. ములుగు జిల్లా రామప్ప సమీపంలో చెట్టును బైక్ ఢీకొట్టి ఇద్దరు బీటెక్ విద్యార్థుల మృతి చెందారు. మహబూబాబాద్ జిల్లా రామన్నగూడెంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి పదేళ్ల బాలుడి చనిపోయాడు. యాదాద్రి భువనగిరి జిల్లా మాసానపల్లికి చెందిన పసునూరి మహేశ్ అనే వ్యక్తి సైతం చెరువులో పడి మృతి చెందాడు.
అప్పటివరకు ఉత్సాహంగా హోలీ ఆడుకున్న పలువురు స్నానానికి సమీప నదులు, వాగులు, చెరువుల్లోకి దిగి నీటమునిగి విగతజీవులుగా మారారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏడుగురు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆరుగురు, రంగారెడ్డి జిల్లాలో ఇద్దరు, జగిత్యాల జిల్లాలో ఒకరు మృతి చెందారు. నారాయణపేటలో నీటి ట్యాంక్ కూలి ఓ చిన్నారి మరణించింది. మొత్తం 17 మంది మృతి చెందారు. ఈ ఘటనలతో ఆయా కుటుంబాలు కన్నీరుమున్నీరుగా విలపించాయి.