తెలంగాణవ్యాప్తంగా 57 కొత్త కోర్టులు.. ఉత్తర్వులు జారీ చేసిన సర్కార్

-

తెలంగాణలో న్యాయవ్యవస్థను మరింత పటిష్ఠం చేసేందుకు.. ప్రజలకు వీలైనంత తక్కువ సమయంలో న్యాయం జరిగేలా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో నూతన న్యాయస్థాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 57 కోర్టులను మంజూరు చేస్తూ కేసీఆర్ సర్కార్ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.

అదనపు జిల్లా, సెషన్స్‌ జడ్జి, సీనియర్‌ సివిల్‌ జడ్జి, జూనియర్‌ సివిల్‌ జడ్జి కేడర్లలో ఈ కోర్టులను ఏర్పాటు చేస్తూ న్యాయశాఖ కార్యదర్శి ఆర్‌.తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణలో రోజురోజుకు పెరిగిపోతున్న కేసులను పరిగణనలోకి తీసుకుని కొత్త కోర్టులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందంటూ ఇటీవల హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. రిజిస్ట్రార్ ప్రతిపాదనలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ క్రమంలోనే ఆర్థిక శాఖ ఆమోదంతో కొత్త కోర్టులను మంజూరు చేసింది. బాలలపై జరిగే నేరాల విచారణకు ప్రత్యేకంగా ఇందులో 10 కోర్టుల ఏర్పాటుకు ప్రాధాన్యమిచ్చినట్లు తిరుపతి తెలిపారు. కొత్త కోర్టుల్లో సిబ్బంది నియామకానికి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేస్తామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news