ఖమ్మం జిల్లాలో జరుగుతున్న ఆత్మీయ సమావేశాల్లో బీఆర్ఎస్ నేతల నిర్లక్ష్యంవల్ల బాణాసంచా నిప్పు రవ్వలు ఇంటిపై పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందడంపట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,ఎంపీ బండి సంజయ్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాధితులందరికీ తక్షణమే మెరుగైన వైద్య సహాయం అందించాలని డిమాండ్ చేశారు. మృతుల, క్షతగాత్రుల కుటుంబాలను అన్ని విధాలా సాయం అందించాలన్నారు. బీఆర్ఎస్ నేతల ఆనందం కోసం సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమాడతారా? అని మండిపడ్డారు.
తక్షణమే బాధ్యులైన బీఆర్ఎస్ నేతలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. మహబూబ్ నగర్ జిల్లాలో కల్తీ కల్లువల్ల ఒకరు చనిపోవడంతోపాటు పలువురు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్లాడుతుండటం సహించరాని నేరం అన్నారు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. ఎక్సైజ్ శాఖ మంత్రి ఇలాఖలో విచ్చలవిడిగా కల్తీకల్లు రాజ్యమేలుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తక్షణమే బాధ్యులను అరెస్ట్ చేసి జైలుకు పంపాల్సిందేనన్నారు. కల్తీకల్లు మాఫియాపై ఉక్కుపాదం మోపని పక్షంలో బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామన్నారు.