నేడు ఆదిలాబాద్ లోక్ సభ నియోజకవర్గంపై బీఆర్ఎస్ సమావేశం

-

నేటి నుంచి నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, మాజీలు, ముఖ్యనేతలు సమావేశం కానున్నారు. లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ముఖ్య నేతలందరికీ బీఆర్ఎస్ అధిష్ఠానం ఆహ్వానం పలికింది. నియోజకవర్గాలకు చెందిన ఎంపీలు, శాసనసభ్యులు, ఎమ్మెల్సీలు, జెడ్పీ ఛైర్మన్లు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్పొరేషన్ల మాజీఛైర్మన్లు, నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, జిల్లా పార్టీ అధ్యక్షులు ఈ సమావేశంలో పాల్గొంటారు. ఇవాళ్టి నుంచి రెండు విడతల్లో సన్నాహక సమావేశాలు జరగనున్నాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంతో ఈ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీల్లో చర్చించనున్నారు. లోక్‌సభ ఎన్నికలకు నేతలు, శ్రేణులను సన్నద్ధం చేసే విషయమై దృష్టి సారించిన బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో నేతల అభిప్రాయాలను వినేందుకు ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకొని పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలనే ఆలోచనలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి పాలైన సీట్లపై ప్రత్యేక దృష్టి పెట్టనున్న పార్టీ అధిష్ఠానం ఓటమి కారణాలను విశ్లేషిస్తూ లోటుపాట్లను సరిదిద్దుకొని ముందుకెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇప్పటికే పార్టీ ముఖ్యులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. నేతలు, శ్రేణులకు వివరించాల్సిన అంశాలపై దిశానిర్దేశం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news