రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అప్సర హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితుడు సాయికృష్ణను కస్టడీలోకి తీసుకున్న శంషాబాద్ గ్రామీణ పోలీసులు సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేశారు. నిందితుడు సాయికృష్ణను వెంట పెట్టుకొని హత్య జరిగిన స్థలానికి పోలీసులు వెళ్లారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ వద్ద కారులో అప్సరను హత్య చేసిన చోటును పరిశీలించారు. అక్కడ అప్సరను సాయి కృష్ణ ఎలా హత్య చేశాడో నిందితుడ్ని అడిగి తెలుసుకున్నారు.
ఆ తర్వాత నేరుగా సరూర్‌నగర్ వెళ్లారు. మ్యాన్‌హోల్‌లో అప్సర మృతదేహాన్ని పడేసిన చోటుకు సాయికృష్ణను తీసుకెళ్లారు. అక్కడ మృతదేహాన్ని మ్యాన్‌హోల్‌లో ఎలా పడేశాడో వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహం పడేసిన రెండు రోజుల తరువాత సాయికృష్ణ, మ్యాన్‌హోల్‌ను మట్టితో నింపి ఆ తర్వాత సిమెంట్‌తో కాంక్రీట్ వేశాడు. మ్యాన్ హోల్ మట్టి వేసిన కూలీలను పోలీసులు ఘటనా స్థలానికి పిలిపించారు. ఇద్దరు కూలీలతో కలిపి సాయికృష్ణను ప్రశ్నించారు. మ్యాన్‌హోల్ పూడ్చే సందర్భంగా సాయికృష్ణ చెప్పిన మాటలను కూలీలు.. పోలీసుల ఎదుట వివరించారు.
పరువు పోతుందనే భయంతోనే హత్య చేసిన్నట్లు సాయికృష్ణ ఒప్పుకున్న విషయం తెలిసిందే. నేటితో అతడి కస్టడీ ముగియనుండటంతో సాయికృష్ణను పోలీసులు రాజేంద్రనగర్ కోర్టులో హాజరుపరచనున్నారు.