మానవతా ప్రమాణాలు నెలకొల్పిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తాజాగా ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఆయన చేపట్టిన ప్రతీ పదవికీ వన్నె తెచ్చారని.. సరళీకృత ఆర్థిక విధానాలతో దేశాన్ని బలమైన శక్తిగా నిలిపారన్నారు. మన్మోహన్ సింగ్ నిర్ణయాలు పేదలను దారిద్య్రం నుంచి బయటపడేశాయని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం మన్మోహన్ పేరు చిరస్థాయిగా ఉంటుందన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్ లో అవసరమైన బలం లేకున్నా ప్రతిపక్షాలను ఒప్పించి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ, ప్రధాని మన్మోహన్ తెలంగాణ బిల్లును ఆమోదింప చేశారని గుర్తు చేశారు. దేశంలో మొదటిసారిగా రైతు రుణమాఫషీ చేసిన ప్రధాని మన్మోహన్ సింగ్ అని.. నేడు రాష్ట్రంలో రెండు లక్షల రుణమాఫీకి స్పూర్తి ప్రధాత మన్మోహన్ సింగ్ అన్నారు. హైదరాబాద్ లో మన్మోహన్ సింగ్ విగ్రహం ఏర్పాటు, ఆయనకు భారత రత్న ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదించిన తీర్మాణానికి సంపూర్ణ మద్దతు వ్యక్తం చేస్తున్నానన్నారు.