సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీకి చెందిన యువజన విభాగం నాయకుడు, దళిత నాయకుడు జువ్వన్న కనకరాజు ఇంట్లో డబ్బులు నిల్వ చేశారని ఫిర్యాదు రావడంతో ఆయన నివాసాన్ని సీజ్ చేశారు పోలీసులు. తన భార్య అనారోగ్యంతో ఉండడంతో చికిత్స నిమిత్తం ఆమెను హైదరాబాద్ యశోద ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ విషయమై పోలీసులు కనకరాజును సంప్రదించగా తాను తన భార్య అనారోగ్యంతో ఉండడంతో హైదరాబాద్‌కు వచ్చానని, తను అధికారులకు పూర్తిస్థాయిలో సహకరిస్తానని చెప్పినా.. ఇంట్లో ఎవరు లేని సమయంలో పోలీసులు ఇంటిని సీజ్ చేసి అక్కడే పోలీస్ పహారాని కూడా ఏర్పాటు చేశారు.
కనకరాజు కుటుంబ సభ్యులు హైదరాబాద్ నుంచి రాగానే పోలీసులకు సమాచారం అందించి ఇంటి తాళాలు తీయాలని కోరగా, సుమారు రెండు గంటల పాటు అనారోగ్యంతో ఉన్న కనకరాజు భార్యను, కుటుంబ సభ్యులను ఇంటి బయటే నిలబెట్టి రెండు గంటలు కాలయాపన చేశారు. నా ఇంటి తాళం తీయండి, అధికారులకు పూర్తిగా సహకరిస్తానని కనకరాజు వేడుకున్నా పోలీసులు కనికరించకుండా దాదాపు రెండు గంటలు ఆలస్యం చేసి కుటుంబ సభ్యులకు ఇబ్బందులకు గురి చేశారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక ప్రజలు భారీగా చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య కనకరాజు ఇంటికి వేసిన సీజ్ ను తొలగించి కనకరాజు ఇంటిని పూర్తిగా తనిఖీ చేయగా ఇంటిలోని దేవుని గళ్ళలో వేసిన చిల్లర పైసలు రూ.276 మాత్రమే లభించాయి. ఇంతకు మించి డబ్బులు ఏమి దొరక్క పోవడంతో పోలీసులు వెనుతిరిగి వెళ్లారు.