సినీ నటి విజయశాంతి బీజేపీలో కొనసాగుతారా ? లేదా అని అనుమానాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలుగా ఉన్న ఆమె.. గత కొంత కాలం నుంచి పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. తనకు పార్టీలు సరైన ప్రాధాన్యత లభించడం లేదని ఆమె భావిస్తున్నారు. ఇటీవల సోనియా గాంధీని తాను అభిమానిస్తానని ఆమె ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అనే అనేక ఊహాగానాలు బయలుదేరాయి. తాజాగా ఆమె చేసిన మరో సుధీర్ఘ పోస్ట్ దానికి బలాన్ని చేకూరుస్తోంది. ఈ ట్వీట్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు విజయశాంతి పార్టీ మారుతున్నారా అనే రూమర్స్ కూడా వినిపించాయి.
తాాజాగా విజయశాంతి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు. చిట్ చాట్ ల పేరుతో ఏదో ఒక వ్యూహంతో చేసే కార్యాచరణ నాకు అలవాటు లేదు.. పార్టీ కి ఏది ముఖ్యమో ఆ అంశాలను పార్టీ ప్రధాన నాయకులకు ఈ నెల 16 న ముఖ్య సమావేశంలో నేను స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ఆ విషయాలు బయటకు లీకేజ్ ల పేరుతో ఇయ్యడానికి నేను వ్యతిరేకిని.. అని ఇదంతా తెలిసి కూడా కొంతమంది మా పార్టీలోని నేతలు పనిగట్టుకుని బీజేపీ కి రాములమ్మ దూరం అంటూ నాపై సోషల్ మీడియా ద్వారా చేయిస్తున్న ప్రచారం తప్పక ఖండంచదగ్గిందని పేర్కొన్నారు విజయశాంతి.