అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేస్తామని హామీనిచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటరీకరణ, క్షేత్రస్థాయి పరిశీలన పేరుతో కాలయాపన చేస్తోందని ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే వచ్చే మార్చి, ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. అంతకంటే ముందే ఫిబ్రవరిలోనే ఎన్నికల కోడ్ వచ్చే అవకాశముంది.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పని తీరుపై బండి సంజయ్ అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణను ఎలా గట్టెక్కిస్తారని ప్రశ్నించారు. డబ్బులు లేని స్థితిలో రాష్ట్రం ఉన్నప్పుడు ఆరు గ్యారెంటీలను ఎలా చేస్తారని ప్రశ్నించారు. తనలో మాత్రమే కాదు.. ఇవన్నీ రాష్ట్ర ప్రజల్లో తలెత్తుతున్న సందేహాలు అని.. వీటన్నింటికీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 6 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసింది అని.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సాక్షిగా డిప్యూటీ సీఎం శ్వేత పత్రాన్ని విడుదల చేసిన విషయం తెలిసిందే. అప్పుల్లో ఉన్న రాష్ట్రంలో అమలుకు సాధ్యం కానీ హామీలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు బండి సంజయ్.