భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరపనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. మరోవైపు ఈ ఏడాది ఏప్రిల్‌లో జరగనున్న శ్రీరామనవమి రోజు జరిగే భద్రాచలం సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముహూర్తం సిద్ధమైంది. ఏప్రిల్ 17వ తేదీన ఉదయం 10:30 గంటలకు కల్యాణ వేడుక జరపనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 16వ తేదీన సాయంత్రం ఎదుర్కోలు మహోత్సవం, 17వ తేదీన ఉదయం 10 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల వరకు సీతారాముల కల్యాణ మహోత్సవం, ఏప్రిల్ 18వ తేదీన శ్రీరాముని మహా పట్టాభిషేకం వేడుకలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలకు లక్షలాది మంది భక్తులు వస్తారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్ధీ దృష్ట్యా ఏప్రిల్ 9వ తేదీ నుంచి 23వ తేదీ వరకు నిత్య కల్యాణ వేడుకను నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు.