భద్రాద్రిలో శ్రీ వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఇవాళ శ్రీరాముల వారు బలరామావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. రేపు శ్రీ కృష్ణ అవతారంలో భక్తులను కనువిందు చేస్తారు. ఈనెల 22వ తేదీన గోదావరిలో సీతారాములకు తెప్పోత్సవ వేడుక నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు.
భద్రాద్రి రామయ్య సన్నిధిలో ఈనెల 23న ఉత్తర ద్వార దర్శనం ఉంటుందని భక్తులంతా ఆరోజు తెల్లవారుజామునే ఆలయానికి వచ్చి స్వామి వారిని వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవాలని అర్చకులు సూచించారు. వైకుంఠ ఏకాదశి ఉత్సవాల నేపథ్యంలో ఈనెల 23 వరకు నిత్య కళ్యాణాలు నిలిపివేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఉత్తర ద్వార దర్శనం కోసం ఆన్‌లైన్‌లో టిక్కెట్లు ఉంచినట్లు వెల్లడించారు. https://bhadradritemple.telangana.gov.inలో ఆన్లైన్లో వైకుంఠ ద్వార దర్శనం టికెట్లు బుక్ చేసుకునేందుకు అవకాశం కల్పించినట్లు వివరించారు.
మరోవైపు అధ్యయనోత్సవాల్లో భాగంగా మంగళవారం రోజున శ్రీరామచంద్రస్వామి నిజరూపంలో దర్శనమిచ్చి భక్తులకు అభయప్రదానం చేశారు. శ్రీరామ అవతారంలో ఉన్న స్వామివారికి ఆలయ అర్చకులు ముందుగా బేడా మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈనెల 13 నుంచి రోజుకు ఒక అవతారంలో దర్శనమిస్తున్న స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఆలయం వద్దకు కదలి వస్తున్నారు.