ఎలైట్ బార్లు ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. ప్రీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోమవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రొహిబిషన్ & ఎక్సైజ్, టూరిజం, కల్చర్, ఆర్కియాలజీ అధికారులతో సమావేశమయ్యారు. ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ, పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ.. మద్యం ధరలను పెంచకుండా ఎక్సైజ్ ఆదాయాన్ని పెంపొందించే మార్గాలను, వనరులను గుర్తించాలని అధికారులకు సూచించారు. ఎలైట్ బార్‌లు/ఎలైట్ షాప్‌లు మొదలైనవాటిని ఏర్పాటు చేయడానికి ఏకీకృత విధానంలో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి మార్గదర్శకాలను రూపొందించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఎక్సైజ్, పోలీసు, సమాచార శాఖలతో కూడిన మల్టీ డైమెన్షనల్ టీమ్‌లను ఏర్పాటు చేసి డ్రగ్స్ ముప్పుపై అవగాహన కల్పించేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆయన నొక్కి చెప్పారు. డ్రగ్స్ ముప్పును అరికట్టేందుకు సరైన యంత్రాంగాన్ని కూడా ఏర్పాటు చేయాలని అన్నారు.