తెలంగాణలో కరోనా తీవ్రత దృష్ట్యా మే31వరకు ప్రభుత్వం లాక్‌డౌన్ విధించిన విషయం తెలిసిందే. అయితే రేపటితో లాక్‌డౌన్ ముగుస్తుండటంతో మళ్లీ లాక్‌డౌన్ పొడగిస్తారంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈరోజు ఉదయం నుంచి అందరూ ప్రభుత్వ నిర్ణయం కోసమే ఎదరుచూస్తున్నారు. అందరూ అనుకున్నట్టు గానే ప్రభుత్వం లాక్డౌన్ పొడిగించింది.
తెలంగాణలో లాక్‌డౌన్‌ను జూన్10 వరకు 10రోజులపాటు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెద్దగా నమోదుకాకపోయినప్పటికీ.. పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.
అయితే లాక్‌డౌన్ సడలింపు సమయాన్ని మూడు గంటల వరకు పెంచింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు సడలింపు సమయాన్ని పెంచారు. వివిధ పనుల కోసం బయటకు వెళ్లిన వారు ఇంటికి చేరడానికి మరో గంట పాటు అవకాశం కల్పిస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి ఉదయం 6గంటల వరకు కఠినంగా లాక్డౌన్ ను అమలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.