తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని.. ఇందుకు లోక్ సభ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. హైదరాబాద్ సరూర్ నగర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అబద్దాలతో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ఓటు షేర్ చాలా తక్కువగా వచ్చిందని.. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే అని దీమా వ్యక్తం చేసారు.
కేంద్రంలో విపక్షాలన్నీ ఏకమైనప్పటికీ మూడోసారి మోడీనే గెలిపించారని తెలిపారు. 70 ఏళ్లుగా ప్రభుత్వ వ్యతిరేకత అనే పదం వింటూ వచ్చాం. కానీ మోడీ పాలనలో ఇంతవరకు ఆ మాట లేదని చెప్పారు. బీజేపీ 13 రాష్ట్రాల్లో సంపూర్ణ మెజార్టీతో అధికారంలో ఉందని.. మరో 6 రాష్ట్రాల్లో NDA అధికారంలో ఉందని.. మొత్తం 19 రాష్ట్రాల్లో బీజేపీదే అధికారమన్నారు. కాంగ్రెస్ పార్టీ ఒక పరాన్న జీవి అని, ఇతర పార్టీల బలహీనతలే కాంగ్రెస్ బలం అని విమర్శలు చేశారు.