రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై.. బీజేపీ ఆధ్వర్యంలో నేడు 24 గంటల ధర్నా

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి ఇప్పటికే మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈసారి తెలంగాణలో ఎలాగైనా అధికారం చేజిక్కుంచుకోవాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. ఇందుకోసం పటిష్ఠ ప్రణాళికలు రచిస్తోంది. ఓవైపు ప్రజలను ఆకర్షించే కార్యక్రమాలు చేపడుతూనే.. మరోవైపు అధికార బీఆర్ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే ఇవాళ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యలపై ఆందోళన చేపట్టేందుకు సిద్ధమైంది.

అధికార బీఆర్ఎస్ పార్టీ  9 ఏళ్ల పాలనలో… ఉద్యోగాలు కల్పించకుండా నిరుద్యోగులను మోసం చేసిందని ఆరోపిస్తూ బీజేపీ ఇవాళ నిరసన దీక్ష చేపట్టనుంది. హైదరాబాద్​లోని ఇందిరా పార్క్ ధర్నాచౌక్ వద్ద ఇవాళ ఉదయం 11 గంటల నుంచి గురువారం ఉదయం 11 గంటల వరకు 24 గంటలు ఆందోళన చేయనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్, పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, పదాధికారులు ఈ నిరసన దీక్షలో పాల్గొననున్నారు. సీఎం కేసీఆర్‌.. హామీ ఇచ్చి విస్మరించిన నిరుద్యోగభృతిని వడ్డీతో సహా చెల్లించడంతోపాటు నిరుద్యోగుల సమస్యలన్నీ పరిష్కరించాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news