తెలంగాణపై బీజేపీ జాతీయ నాయకత్వం స్పెషల్ ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణ గద్దెపై కాషాయ జెండాను రెపరెపలాడించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇప్పటికే ఆ దిశగా చర్యలు చేపట్టి.. వ్యూహాలు రచిస్తోంది. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో తన వ్యూహాలను వేగంగా అమలు చేస్తోంది.
కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత.. రాష్ట్ర బీజేపీలో నెలకొన్న స్తబ్ధతను తొలగించడం, పార్టీ నేతల్లోని అసంతృప్తి తొలగించేలా చర్యలు చేపట్టింది. పార్టీలో నెలకొన్న పరిస్థితులను చక్కదిద్ధుతూనే ఇతర కార్యక్రమాలు నిర్వహణకు సిద్ధమవుతుంది. జులై 8న హైదరాబాద్లో 11 రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించనుంది. ఆ సమావేశం తెలంగాణపై ప్రభావం చూపిస్తోందని జాతీయ నాయకత్వం భావిస్తోంది. ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ వేదికగా పార్టీ జాతీయ స్థాయి కార్యక్రమాలు చేపట్టేలా ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగా జులై 8న రాష్ట్రాల అధ్యక్షులు, సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో సమావేశాన్ని నిర్వహిస్తోంది. ఈ సమావేశానికి రాష్ట్ర నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు.