తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పది నెలల పాలన విజయవంతంగా కొనసాగింది అని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. శనివారం గాంధీభవన్లో ఆయన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులను అధిగమించి హామీలను నెరవేరుస్తున్నామన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండూ ఒకటే అని విమర్శించారు. ప్రభుత్వంపై కుట్ర పూరితంగా ఒకరి తర్వాత ఒకరు విమర్శలు, ఆందోళనలు చేస్తున్నారని మండిపడ్డారు. రైతుల కోసం మొన్న బీజేపీ ఆందోళన చేస్తే.. ఇవాళ బీఆర్ఎస్ ఆందోళన చేస్తోందని ఎద్దేవా చేశారు.
వరదల వల్ల రూ.10 వేల కోట్ల నష్టం జరిగితే.. కేంద్రం రూ.400 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నదని అసహనం వ్యక్తం చేశారు. దీనిపై బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు కూడా సరైన రీతిలో స్పందించడం లేదన్నారు. మరోవైపు మంత్రి కొండా సురేఖ విషయంలో సంయమనం పాటించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. మంత్రి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నాక కూడా చిత్ర పరిశ్రమకు సంబంధించిన కొందరు ప్రముఖులు స్పందించడం కరెక్ట్ కాదన్నారు. ఎవరైనా వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటన చేశారు అంటే.. అక్కడితో ఇక ఆ సమస్య ముగిసినట్లే అని వెల్లడించారు.