కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించేందుకు త్వరలో కేసీఆర్ ప్రజల్లోకి రాబోతున్నారని గత మూడు రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారంపై స్పందించారు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. శనివారం ఆయన రామగుండం ప్రాంతంలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా రామగుండంలో ఇప్పటికే ఉన్న పాత జన్కొ పవర్ ప్లాంట్ ని పరిశీలించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. కెసిఆర్ ఏ మొహం పెట్టుకొని ప్రజల్లోకి వస్తారని విమర్శించారు. ప్రజలను మోసం చేసిన వ్యక్తికి ప్రజలలోకి వచ్చే అర్హత లేదన్నారు బట్టి విక్రమార్క. బీఆర్ఎస్ నేతలు రుణమాఫీ పై దుష్ప్రచారం చేస్తున్నారని.. రుణమాఫీ కానీ రైతులు అధైర్యపడవద్దని సూచించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనం దుర్వినియోగం చేశారని.. బిఆర్ఎస్ నేతలు దోచిన సొమ్మును విదేశాలలో దాచుకున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో తెలంగాణ సంపద దోపిడీకి గురైందన్నారు. అందుకే కేసీఆర్ ను దించి ప్రజలు కాంగ్రెస్ ని గెలిపించారన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పాం.. చేసి చూపించామన్నారు. అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మనసు గెలుచుకుందన్నారు భట్టి విక్రమార్క. ప్రజలకు మంచి చేస్తున్న తమ ప్రభుత్వాన్ని బద్నామ్ చేయాలని చూస్తే బీఆర్ఎస్ ని ప్రజలు క్షమించరని హెచ్చరించారు.