పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో గ్రామాల్లో అభివృద్ధి కుంటు పడిందని.. సర్పంచ్ లను సైతం బిచ్చగాళ్లను చేశారంటూ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల కష్టాలను ఏనాడు పట్టించుకోకుండా ఫామ్ హౌజ్ లో పడుకున్న కేసీఆర్.. నేను నన్ను ఓడించేందుకు కరీంనగర్ కు వస్తున్నాడట అంటూ ఎద్దేవా చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి కరీంనగర్ కు కేసీఆర్ ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు.
గ్రామాల్లో అప్పులు చేసి మరీ అభివృద్ధి చేసిన సర్పంచ్ లకు బిల్లులు విడుదల చేయకుండా వారి ఆత్మహత్యలకు ఎవ్వరూ కారణం అయ్యారో అందరికీ తెలుసు అన్నారు. బూటకపు హామీలతో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందని.. ఇప్పటివరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో రైతులను మభ్య పెట్టి ఓట్లు కొల్లగొట్టేందుకు ఏక కాలంలో రూ.2లక్షల రుణమాఫీ అంటూ ప్రచారం చేస్తోందని ఆరోపించారు.