ఉచిత విద్యుత్‌పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో తీవ్ర దుమారం రేపాయి. రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ధర్నా నిర్వహించాయి. హైదరాబాద్‌లో విద్యుత్ సౌధ వద్ద నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులు సంతోషంగా బతకాలంటే పంటలకు నాణ్యమైన విద్యుత్ ఉండాలని కవిత అన్నారు.
రేవంత్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ బోగస్ అని అర్థమైందని కవిత వ్యాఖ్యానించారు. ‘‘60 ఏళ్ల పాటు దేశంలో అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడ్డారు. రైతులకు 24 గంటల విద్యుత్ ఎందుకు ఇవ్వొద్దు? పరిశ్రమలకు ఇవ్వొద్దు అనే ధైర్యం రేవంత్‌కు ఉందా?మూడు పూటలా అన్నం పెట్టే రైతులకు 3 గంటలే విద్యుత్ ఇవ్వాలనే రేవంత్‌ను ఊరు పొలిమేర వరకు తరిమికొట్టాలి. రైతులకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలి. రేవంత్ క్షమాపణ చెప్పే వరకు కాంగ్రెస్ నేతలను గ్రామాల్లో తిరగనీయొద్దు’’ అని కవిత తీవ్రంగా ధ్వజమెత్తారు.