సంపద సృష్టించే అమరావతిని సీఎం జగన్ చంపేశారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఒకరి మూర్ఖత్వానికి, పిచ్చితనానికి రాష్ట్రం బలికావాలా? అని ప్రశ్నించారు. అమరావతిని రాజధానిగా ప్రకటించకముందు అక్కడ భూమి ధరెంత అని అడిగారు. రాజధానిగా కొనసాగి ఉంటే ఎంత ఉండేదో ఎవరైనా బేరీజు వేశారా అని నిలదీశారు. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు తగ్గితే ఏపీలో పెరుగుతున్నాయని చంద్రబాబు ధ్వజమెత్తారు. కౌలు రైతులు పూర్తిగా నాశనమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్ టు రిచ్ అర్థం చేసుకోవడం కష్టమైనా ఆచరణలో ఇది అద్భుత ఫలితాన్ని ఇస్తుందని చంద్రబాబు అన్నారు. టీడీపీ మినీ మేనిఫెస్టోలోని పూర్ టు రిచ్ విధానం వినూత్నమైందని చెప్పారు. మహిళలకు ఇప్పటివరకు ప్రకటించిన నాలుగు పథకాలే కాకుండా వీలైనన్ని ఎక్కువ కార్యక్రమాలు చేసే ఆలోచన ఉందని తెలిపారు. ‘‘కట్టెల పొయ్యిపై మా అమ్మ పడిన కష్టాలు ఎన్నో చూశాను. మా అమ్మ కష్టాలు చూసే ఆనాడు గ్యాస్ స్టవ్‌లు అందించే పథకం తీసుకొచ్చాం. పెరిగిన ధరలతో మహిళలు మళ్లీ కట్టెల పొయ్యికి పరిమితమయ్యేలా ఉన్నారు. సంపద సృష్టి ద్వారా పేదరికం పోగొట్టాలి’’అని చంద్రబాబు అన్నారు.