ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర భారత జనత పార్టీ రాజ్య సభ్యుడు టీజీ వెంకటేశ్ పై హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ట్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. బంజారా హిల్స్ లో రూ. 100 కోట్ల విలువైన ఒక భూ వివాదంలో టీజీ వెంకటేశ్ తో పాటు ఆయన సోదరుడి కుమారుడిపై బంజారా హిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగ 2005 లో అప్పటి ప్రభుత్వం.. రోడ్ నెంబర్ 10 లో ఎపీ జెమ్స్ అండ్ జువెలర్స్ పార్క్ కోసం రెండున్నర ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఈ స్థలంలో నిర్మాణ పనులు చేపట్టారు. ఈ స్థలం పక్కన మరో అర ఎకరం స్థలం ఉంది.
అయితే ఈ స్థలం తమదే అంటూ.. కొందరు టీజీ వెంకటేశ్ సోదరుడి కుమారుడు, సినీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ కు డెవలప్ మెంట్ అగ్రిమెంట్ చేశారు. దీంతో ఆ స్థలాన్ని ఆధీనంలోకి తీసుకోవడానికి ఆదివారం కర్నూల్ జిల్లా నుంచి వాహనాల్లో 90 మంది మారణాయుధాలతో అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉండే వాచ్ మెన్ పై దాడి చేసి వీరంగం సృష్టించారు. విషయం తెలుసుకున్న బంజారా హిల్స్ పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకున్నారు.
90 మందిలో పలువురు పరారు కాగ.. 63 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి మారణాయుధాలు, వాహానాలను స్వాధీనం చేసుకున్నారు. కాగ ఈ వివాదంలో ఎంపీ టీజీ వెంకటేశ్, ఆయన సోదరుడి కుమారుడు తో పాటు సినీ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ పై కూడా కేసు నమోదు చేశారు.