అసలు తెలంగాణలో టీడీపీ ఉందా? దాదాపు కనుమరుగై.. ప్రజల మది నుండి తుడిచిపెట్టుకుపోయే స్థితిలో ఉందని అందరూ అనుకుంటున్న తరుణంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ ప్రాంత నేతలతో కీలక సమావేశం నిర్వహించడం రెండు రాష్ర్టాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు చంద్రబాబు వ్యూహమేమిటనే దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఎవరు అవునన్నా కాదన్నా తెలంగాణలో టీడీపీ ఉనికి నామమాత్రమే. క్షేత్ర స్థాయిలో పెద్ద సంఖ్యో కార్యకర్తలు ఇతర పార్టీల్లో చేరిపోయారు. కొన్ని చోట్ల నామ్ కే వాస్తే అన్నట్లు చోటామోటా నాయకులు మాత్రమే మిగిలారు.
తెలంగాణ ఏర్పడిన తర్వాత టీటీడీపీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన నేతలందరూ గులాబీ దళంలో చేరి కారుపై సవారీ చేస్తున్నారు. ఆ పార్టీలో పేరున్ననేతలెవరూ లేదన్నది జగమెరిగిన సత్యం. ఒకానొక దశలో టీటీడీపీని చంద్రబాబు వదిలేశారు అన్నంత ప్రచారం కూడా జరిగింది. ఇలాంటి గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్న తరుణంలో చంద్రబాబు ఈ ప్రాంత నేతలతో సమావేశమై పార్టీని బలోపేతం చేయాలని సూచించడం వెనుక ఏమయి ఉంటుందని రాజకీయ నేతలు ఉత్సాహంతో చర్చించుకుంటున్నారు. అయితే.. ప్రస్తుతం తెలంగాణలో మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీకి మళ్లీ పునర్ వైభవం వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయని అధినేత చంద్రబాబు భావిస్తున్నారని పార్టీ నేతలు అంతర్గతంగా చర్చించుకుంటున్నారు.
ఈ సమావేశంలో చంద్రబాబు కీలక సూచనలు చేశారని అంటున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో, ఆ తర్వాత కాలంలో పార్టీకి వ్యతిరేకంగా జరిగిన ప్రచారంతో టీడీపీకి ప్రజలు దూరమయ్యారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని చంద్రబాబు గట్టిగా నమ్ముతున్నారని పేర్కొంటున్నారు. ఆంధ్రా పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన టీఆర్ఎస్ తిరిగి వారితోనే చేతులు కలుపుతోందని, కాంట్రాక్టుల్లో అధిక భాగం ఆంధ్రావారికే కట్టబెడుతోందని, ఇది తెలంగాణ ప్రజల్లోకి బలంగా వెళ్లిందని ఈ సమావేశంలో చంద్రబాబు విశ్లేషించారని చెబుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీకి ఆదరణ ఉన్నట్లు కనిపించినా అనేక ప్రాంతాల్లో ఆ పార్టీకి బలమైన కేడర్ లేదని, అంతర్గత కుమ్ములాటలతో కాంగ్రెస్ పుంజుకోవడం సాధ్యంకాదని కూడా అన్నారని తెలిసింది. ఈసారి రాజకీయ పరిస్థితులు తారుమారయ్యేలా ఉన్నాయని, అధికార టీఆర్ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్ లలో ఏ ఒక్క దానికి అనుకూల పరిస్థితులు లేవని పేర్కొన్నారు.
ఇప్పటికే చాలావరకు సీన్ మారిపోయిందని, ఇంకా వచ్చే ఎన్నికల్లోపు ఇంకా చాలా మారుతుందని కూడా చెప్పారు. ఈ తరుణంలో టీడీపీ నేతలు మరోసారి క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగాలని, పాత కేడర్ ను మళ్లీ పార్టీలోకి రప్పించాలని నిర్దేశించారు.ఈ వ్యూహంలో భాగంగా ఈ నెల 25 నుంచి జరిగే సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చురుకుగా నిర్వహించాలని, టీఆర్‌ఎస్ వైఫల్యాలతోపాటు గత టీడీపీ హయాంలో చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి వెళ్లి వివరించేందుకు ప్రణాళికలు రూపొందించాలని, పార్టీని వీడినవారితో పాటు ఇతర పార్టీల వారిని సైతం ఆహ్వానించాలని నిర్దేశించారు.
త్వరలో నిర్వహించబోయే మినీ మహానాడు ద్వారా పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తానని కూడా చెప్పారు. చంద్రబాబు వ్యూహాలు ఎలా ఉన్నా.. టీఆర్ఎస్ కు బలమైన ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీని దాటుకుని టీడీపీ ముందుకు పోగలదా? కాంగ్రెస్ ను మించగలదా? రానున్న రాజకీయ పరిణామాలు టీడీపీ పాత్రను నిర్ణయిస్తాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు.