సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తనదైన స్పీడుతో దూసుకెళ్తున్నారు. ఇవాళ భద్రాద్రి కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొన్నారు. ఈ సభలో ఆయన మాట్లాడుతూ.. ‘భద్రాద్రి సీతారామ చంద్రస్వామి కొలువుదీరిన ఈ పావన భూమికి నేను శిరసు వంచి నమస్కరింస్తున్నా. ఆ స్వామి పేరునే ఈ జిల్లాకు పెట్టుకున్నాం. నేనో నాలుగు విషయాలు చెప్పదల్చుకున్నా. శ్రద్ధగా వినండి. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయ్యింది. అయినా దేశంలో రావాల్సినంత రాజకీయ పరిణతి రాలేదు. ఎన్నికలొస్తే అబద్ధాలు చెప్పడం, బూతులు తిట్టుకోవడం, మోసపూరిత వాగ్ధానాలు. ఇదీ మన దేశంలో జరుగుతున్న తంతు’ అన్నారు.
ఈ దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ ఉంది. ప్రజల చేతిలో ఉన్న ఒకే ఒక్క వజ్రాయుధం లాంటి ఆయుధం ఓటు. ఆ ఓటు ఆగమాగం వేస్తే మన తలరాత కింద మీదైతది. ప్రజలు కోరుకున్న వాళ్లు గెలిచినప్పుడే అది ప్రజల గెలుపు అయితది. కాబట్టి బాగా ఆలోచించి ఓటేయాలి. మూడు పార్టీల నుంచి ముగ్గురు అభ్యర్థులు పోటీల ఉంటరు. ఆ ముగ్గురిలో ఎవరు మంచి వ్యక్తో చూడాలి. పార్టీల వైఖరి, ఆ పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులను బేరీజు వేసుకోవాలి. ప్రతి ఒక్కరూ అలా ఆలోచించి ఓటేస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతది’ అని సీఎం సూచించారు.