చలాన్ డిస్కౌంట్ ఆఫర్ కు నాలుగు రోజుల్లోనే భారీగా స్పందన వచ్చిందని అన్నారు జాయింట్ ట్రాఫిక్ సీపీ రంగనాథ్. మూడు కమిషనరేట్ల పరిధిలో అనూహ్య స్పందన వచ్చిందన్నారు. దాదాపుగా రూ. 650 కోట్లకు పైగా విలువైన చలాన్స్ క్లియర్ అయ్యాయని ఆయన వెల్లడించారు. ఇందులో రాయితీ పోటా రూ. 190 కోట్లు ఖజానాకు వచ్చాయని తెలిపారు. కోటీ ఎనబై ఐదు లక్షల చలాన్లు క్లియర్ అయ్యాయని వెల్లడించారు. రోజుకు ఏడు నుండి పది లక్షల చలాన్లు క్లియర్ అవుతున్నాయని… మార్చి 31 వరకు ఈ అవకాశం ఉందని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అయితే ఈ గడువును పొడగించే ఆలోచన ఇప్పటి వరకైతే లేదని ఆయన అన్నారు.
మొత్తం 15 వందల కోట్ల విలువైన చలాన్లు పెండింగ్ లో ఉన్నాయని… 60-70 శాతం క్లియర్ అవుతాయని ఆశిస్తున్నామని ఆయన అన్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో హైయెస్ట్ చలాన్లు క్లియర్ అయ్యాయని తెలిపారు. ఎప్రిల్ నుంచి ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చార్జిషీట్స్ వేస్తామని హెచ్చరించారు. కోవిడ్ కారణాలతో గ్యాప్ ఇచ్చామని… తిరిగి మునపటి లాగే కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతాం అని అన్నారు. కార్ల అద్దాలపై నిబంధనలకు విరుద్ధంగా స్టిక్కర్స్ వేసుకుని తిరిగితే చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. ఢిల్లీ, చెన్నై, ముంబై, కోల్ కతా నగరాల్లో స్పీడ్ లిమిట్ పై అధ్యయనం చేస్తున్నమాని… నగర వ్యాప్తంగా స్పీడ్ లిమిట్ ఒకే రకంగా ఉండేలా ప్రణాళిక సిద్దం చేస్తున్నామని వెల్లడించారు జాయింట్ ట్రాఫిక్ సీపీ రంగనాథ్.