రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణపై నెలకొన్న సందిగ్ధత ఇవాళ తొలగిపోనున్నట్లు సమాచారం. ప్రస్తుతం దిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ విస్తరణ, రాష్ట్ర పీసీసీ నూతన అధ్యక్షుడిగా ఎవర్ని ఎన్నుకోవాలన్న విషయంపై ఇవాళ హైకమాండ్తో సమావేశమై చర్చించనున్నారు. గురువారం రాత్రి 11 గంటలకు దిల్లీ బయల్దేరిన సీఎం రేవంత్.. ఇవాళ ఏఐసీసీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో సమావేశం కానున్నారు.
మరో ఆరుగురిని మంత్రివర్గంలోకి తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అవకాశం ఉంది. అయితే ఉన్న స్థానాలేమో ఆరు.. పదవులు ఆశిస్తున్న ఎమ్మెల్యేల జాబితా మాత్రం చాంతాడంత. ఇందులో సామాజిక వర్గాల సమతుల్యత పాటించడం ఇప్పుడు పార్టీకి తలనొప్పిగా మారింది. ఇప్పటికే ఈ విషయంపై పలుమార్లు చర్చలు జరిపినా ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణపై నెలకొన్న సందిగ్ధతకు ఇవాళ తెర పడుతుందని కాంగ్రెస్ నాయకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు నూతన పీసీసీ అధ్యక్షుడి ఎంపికలోనూ సామాజిక సమీకరణలే ఆటంకంగా ఉన్నట్లు తెలిసింది. దీంతో ఎంపిక ఇప్పట్లో ఓ కొలిక్కి వచ్చే అవకాశం లేదని సమాచారం.