సీఎం కేసీఆర్ ఈ నెల 22వ తేదీన రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం కొండకల్ గ్రామ సమీపంలో వందేభారత్, మెట్రో కోచ్‌లు తయారు చేసే మేధా సర్వోగ్రూప్ రైల్వేకోచ్ పరిశ్రమను ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి రాక సందర్భంగా పరిశ్రమలో భద్రతా ఏర్పాట్లను హెచ్‌ఎండీఏ కమిషనర్ అర్వింద్‌కుమార్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ శరత్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలు పరిశీలించారు. కొల్లూరులో రెండు పడక గదుల ఇళ్ల ప్రారంభోత్సవం అనంతరం సీఎం నేరుగా కొల్లూరు అవుటర్ నుంచి ముత్తంగి జంక్షన్ వద్ద దిగి రైల్వేకోచ్‌కు చేరుకుంటారు.
ఇది దేశ ప్రైవేటు రంగంలో అతిపెద్ద ప్రైవేటు రైల్వేకోచ్ ఫ్యాక్టరీ. ఆ సంస్థ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 25 ఎకరాల్లో నిర్మాణాలు చేపట్టి ప్రాథమికంగా ఉత్పత్తి చేపడుతున్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నడుస్తున్న రెండు వందేభారత్ రైళ్లకు వీటినే బిగించారు. ఇప్పటికే 160 బోగీలు సరఫరా చేసినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మరో 75 ఎకరాల్లో వ్యాగన్ల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.