హైదరాబాద్ పాతబస్తీ మెట్రోపై గత ఐదారేళ్లుగా చర్చ నడుస్తోంది. ప్రతి అసెంబ్లీ సమావేశంలో దీని ప్రస్తావన వస్తోంది. అప్పటి వరకే చర్చ జరుగుతోంది. ఆ తర్వాత షరామామూలే. అయితే తాజాగా ఓల్డ్ సిటీ మెట్రో ప్రాజెక్టుకు మహర్దశ వచ్చింది. పాత బస్తీ మెట్రో రైలు ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లాలని పురపాలక శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు.
ఎల్ అండ్ టీ ఛైర్మన్‌తో సీఎం కేసీఆర్ మాట్లాడారని.. త్వరగా చేపట్టాలని చెప్పినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. అవసరమైన పూర్తి సహాయసహకారాలు అందిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు కేటీఆర్ తెలిపారు. మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ పట్ల హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ సంతోషం వ్యక్తం చేశారు. కేటీఆర్ చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నట్లు చెప్పారు. పాతబస్తీ ప్రజలు ప్రజా రవాణా కనెక్టివిటీ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్నారంటూ ట్వీట్ చేశారు. ఇది ఖచ్చితంగా ఓల్డ్ సిటీ ప్రజలకు ఉపయోగపడటంతో పాటు మరింత పర్యాటక శోభను తీసుకువస్తుందని అన్నారు.